
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ.. తాను తయారుచేసిన నాజల్ కరోనా వ్యాక్సిన్ ‘‘ఇన్‌కొవాక్’’ డోసు ధరను రూ.800 (ట్యాక్స్‌లు అదనం)గా నిర్ణయించింది. కోవిన్ పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవచ్చని భారత్ బయోటెక్ ప్రకటించింది. జనవరి నాలుగో వారం నుంచి ఇది అందుబాటులోకి వస్తుందని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్క డోసు రూ.325కి ఇవ్వనున్నట్టు వివరించింది. కేవలం ప్రైవేట్ హాస్పిటల్స్‌లోనే అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది.
18 ఏండ్లు పైబడిన వారికి బూస్టర్ డోసుగా అందించేందుకు ఈ వ్యాక్సిన్ కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ఫేజ్–3 ట్రయల్స్ 14 ప్రాంతాల్లో, హెటిరోలాగస్ ట్రయల్స్ 9 ఏరియాల్లో నిర్వహించినట్టు వివరించింది. ట్రయల్స్ టైంలో వ్యాక్సిన్ తీసుకున్న వారి లాలాజలంలో యాంటీ బాడీలు పెరిగినట్టు గుర్తించామని చెప్పింది. అప్పర్ రెస్పిరేటరీలో ఉండే మ్యూకోసల్ ఐజీఏ యాంటీ బాడీస్ ఇన్ఫెక్షన్ తగ్గించిందని తెలిపింది.
అనుకున్న లక్ష్యాలు సాధించాం
కరోనా టైంలో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించామని, కోవాగ్జిన్, ఇన్కోవాక్తో పాటు రెండు వేర్వేరు డెలివరీ సిస్టమ్స్‌తో 2 వ్యాక్సిన్లను తయారు చేశామని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా తెలిపారు. ఈజీగా, నొప్పి లేకుండా ఈ నాజల్ వ్యాక్సిన్ తీసుకోవచ్చన్నారు. సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేసుకోవచ్చన్నారు. ‑ కృష్ణ ఎల్లా, భారత్ బయోటెక్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్