- అయ్యో పాపం! ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ
- మస్కట్ నుంచి పెండ్లికి వచ్చి తల్లీకూతుళ్ల సజీవ దహనం
- బంధువుల ఇంటికొచ్చి తిరిగి వెళ్తున్న బెంగుళూరుకు చెందిన తల్లీకొడుకులు మృతి
- దీపావళికి ఇంటికొచ్చి తిరిగి వెళ్తుండగా కాలి బూడిదైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
- జాబ్‌లో జాయిన్ అయ్యేందుకు వెళ్తూ యువకుడు..
కర్నూలు దగ్గర బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఆరుగురు చనిపోయారు. ఇందులో తల్లీకూతుళ్లతో పాటు బంధువుల ఇంటికి కొచ్చి తిరిగి వెళ్తున్న బెంగుళూరుకు చెందిన తల్లీకొడుకులున్నారు. దీపావళికి ఇంటికొచ్చి తిరిగి వెళ్తుండగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాలిబూడిదయ్యారు. జాబ్‌లో జాయిన్అయ్యేందుకు బెంగళూరు వెళ్తున్న మరో యువకుడు మృత్యువాతపడ్డాడు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిది ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాథ..
న్యూస్ నెట్‌వర్క్, వెలుగు
గాయపడ్డ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
హయత్‌నగర్ టీనగర్‌లో నివాసముండే ఆందోజు నవీన్ కుమార్ (26) తీవ్రంగా గాయపడి కర్నూల్దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. నవీన్ కుమార్ బెంగళూరులోని విప్రో కంపెనీలో జాబ్చేస్తున్నాడు. దీపావళి కోసం ఇంటికి వచ్చి రాత్రి 11 గంటలకు నాంపల్లిలో బెంగళూరు బస్సెక్కాడు. ప్రమాదం జరిగిందని గుర్తించిన నవీన్.. వెనక వైపు బస్సు అద్దాలు పగిలి ఉండడంతో అందులోంచి దూకాడు. దీంతో కాలుకు ఫ్రాక్చర్ అయ్యింది.
బస్సు మిస్సై బతికిపోయిన నేవీ ఆఫీసర్
బస్సు మిస్ కావడంతో సికింద్రాబాద్‌కు చెందిన నేవీ లెఫ్టినెంట్ కమాండర్ అదృష్టవశాత్తు ప్రమాదంనుంచి తప్పించుకున్నాడు. సికింద్రాబాద్ చిలకలగూడ బడే మసీదు ప్రాంతానికి చెందిన సోమయ్య కొడుకు తరుణ్ కుమార్బెంగళూరులోని నేవీ ఆఫీసులో లెఫ్టినెంట్కమాండర్గా పని చేస్తున్నాడు. దీపావళి సెల వులకు ఇటీవల సికింద్రాబాద్‌కు వచ్చిన తరుణ్‌కుమార్(27) తిరిగి బెంగళూరు వెళ్లడానికి వేమూరి కావేరి ట్రావెల్స్లో టికెట్ నెంబర్ యూ2 బుక్ చేసుకున్నాడు. గురువారం రాత్రి ప్యారడైజ్వద్ద బస్సు ఎక్కాల్సి ఉంది. అయితే, శంషాబాద్‌లో పని ఉండడంతో అక్కడే బస్సు క్యాచ్చేద్దామని అనుకున్నాడు. కానీ.. పని పూర్తికాకపోవడంతో బస్సెక్కలేకపోయాడు. దీంతో ప్రాణాలతో బతికిపోయాడు.
బస్సును వెంబడించి క్యాచ్ చేసి..
కడప జిల్లా జమ్మలమడుగు మండలం నెమలి దిమెమ్ గ్రామానికి చెందిన జయసూర్య(23).. మియాపూర్ మక్త మహబూబ్‌పేట్‌లోని ప్రజయ్షెల్టర్హోమ్స్ లో ఉంటున్నాడు. మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్పూర్తి చేశాడు. బెంగుళూరులో జాబ్ ఇంటర్వ్యూకు వెళ్తున్నాడు. గురువారం మియా పూర్ అల్విన్ క్రాస్ రోడ్డు వద్ద జయసూర్య బస్సెక్కాల్సి ఉండగా మిస్ చేసుకున్నాడు. దీంతో బస్సును ఛేజ్ చేసి మూసాపేట్వై జంక్షన్ వద్ద క్యాచ్చేశాడు. ప్రమాదం జరిగిన తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్పగలగొట్టుకుని బయటకు దూకాడు. రెండు కాళ్లకు దెబ్బలు తగలడంతో కర్నూలు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
పండుగకు వచ్చి.. వెళ్తుండగా..
యాదాద్రి జిల్లా వస్తాకొండూరుకు చెందిన అనూష రెడ్డి(23) బెంగళూరులోని ఓ కంపె నీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. పండుగ కొచ్చిన ఆమె తిరిగి వెళ్లడానికి రెడ్ బస్ యాప్‌లో టికెట్ బుక్ చేసుకున్నారు. గురువారం రాత్రి లక్డీకాపూల్‌లో వీ కావేరీ ట్రావెల్స్బస్సెక్కారు. ప్రమాదంలో అనూష మృతి చెందారు. శుక్రవారం విషయం తెలియగానే ఆమె తండ్రి శ్రీనివాస్‌రెడ్డి సహా కుటుంబీకులు కర్నూలుకు బయలుదేరి వెళ్లారు.
బంధువుల ఇంటికి వచ్చి..
బెంగళూరుకు చెందిన ఫిల మిన్ బేబీ (62), తన కొడుకు కిశోర్ కుమార్ (41)తో కలిసి దీపావళి పండుగ కోసం పటాన్‌చెరులోని కృషి డిఫెన్స్ కాలనీలో ఉండే బంధువుల ఇంటికి వచ్చారు. గురువారం కూకట్‌పల్లి వెళ్లి రాత్రి 9 గంటలకు బస్సెక్కారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో తల్లీ కొడుకులు ఇద్దరూ సజీవ దహనమయ్యారు.
వెనుక సీట్లో కూర్చోవడంతో..
ప్యారడైజ్వద్ద బస్సెక్కి న అనంతపూర్ జిల్లా హిందూపురానికి చెం దిన మూలింటి వేణు గోపాల్‌రెడ్డి(25).. ప్రమాదానికి గురైనప్పుడు భారీ శబ్దం రావడంతో ఉలిక్కిపడి నిద్రలేచాడు. వెంటనే ఎవరో బస్సు కాలిపోతున్నదని అరవడంతో వెనుక ఉన్న అద్దాన్ని ఎవరో పగలగొట్టడంతో బయటకు దూకాడు.
జాబ్‌లో జాయిన్ అయ్యేందుకు వెళ్తూ..
పది రోజుల కిందటే ఉద్యోగం రావడంతో జాబ్‌లో జాయిన్ అయ్యేందుకు వెళ్తూ ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన యువకుడు చనిపోయాడు. ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చెందిన చిత్తూరి శ్రీనివాసరావు, విజయ దంపతుల కుమారుడు మేఘనాథ్ (25) చదువుల కోసం తల్లితో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. 10 రోజుల కిందటే అతడికి బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. జాబ్‌లో జాయిన్ అయ్యేందుకు గురువారం రాత్రి కావేరి ట్రావెల్స్ బస్సులో బయలు దేరాడు. బస్సు దగ్ధం అయినట్టు టీవీలో వార్త చూసి ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ వచ్చింది. ఏం జరిగిందోనని భయపడిన బంధువులు విచారించగా అతడు చనిపోయినట్టు తెలిసింది.
మస్కట్ నుంచి వచ్చి..
మెదక్ మండలం శివ్వాయిపల్లికి చెందిన మంగ సిద్ధాగౌడ్ కొడుకు ఆనంద్ కుమార్‌గౌడ్ మస్కట్‌లో సాఫ్ట్ వేర్ఉద్యోగం చేస్తున్నాడు. భార్య సంధ్యారాణితో కలిసి బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు 10 రోజుల కిందట హైదరాబాద్ వచ్చారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్న వారి కూతురు మంగ చందన(23), అలహాబాద్ ఐఐటీలో బీటెక్ చదువుతున్న కొడుకు శ్రీ వల్లభ కూడా హైదరాబాద్ వచ్చారు. బంధువుల పెళ్లి కాగానే వారం కిందట ఆనంద్ మస్కట్ వెళ్లి పోగా, శ్రీవల్లభ అలహాబాద్ చేరుకున్నాడు. కూతురు చందనను బెంగళూరులో వదిలి పెట్టి అక్కడి నుంచి మస్కట్ వెళ్లేందుకు సంధ్యారాణి ప్లాన్ చేసుకున్నారు. రెడ్ బస్ యాప్ ద్వారా వీ కావేరీ ట్రావెల్స్ స్లీపర్ కోచ్‌లో సీట్లు బుక్ చేసుకున్న చందన, సంధ్యారాణి గురువారం రాత్రి మూసాపేట వై జంక్షన్ వద్ద బస్సెక్కారు. ప్రమాదంలో తల్లీ కూతుళ్లు మంగ సంధ్యారాణి (43), మంగ చందన (23) సజీవ దహనమయ్యారు.
కూకట్‌పల్లిలో బస్సెక్కిన ఇద్దరు సేఫ్
ప్రమాదానికి గురైన బస్సులో కూకట్‌పల్లిలో ఆరుగురు ఎక్కారు. ఇందులో ఇద్దరు క్షేమంగా ఉన్నారని తెలిసింది. కూకట్‌పల్లి పరిధిలోని జేఎన్టీయూ వద్ద రామారెడ్డి బస్సెక్కాడు. ఇతని కూతురు బెంగళూరులో చదువుకుంటున్నది. ఆమెను చూడడానికి బెంగళూరు బయలుదేరాడు. ప్రమాదం జరిగినప్పుడు తాను షాక్‌లో ఉన్నానని, ఎవరో తనను కిటికీ అద్దాల నుంచి చెయ్యి పట్టుకుని బయటకు లాగారని చెప్పాడు. కింద పడటం వల్ల ముఖానికి చిన్న చిన్న గాయాలయ్యాయని తెలిపాడు. ఫస్ట్‌ఎయిడ్ చేయించుకుని హైదరాబాద్ వచ్చినట్టు చెప్పాడు. కాగా, సాయిహర్ష అనే మరో ప్రయాణికుడు నిజాంపేట చౌరస్తా వద్ద బస్సెక్కాడు. బెంగళూరులో స్నేహితుడిని కలవడానికి వెళ్తున్న ఇతను కూడా ప్రాణాలతో బయటపడ్డాడు.
అద్దం బ్రేక్ చేయడంతో బయటపడ్డ హారిక
బస్సులో ఎర్రగడ్డ వద్ద ఇద్దరు, ఎస్సార్ నగర్ నుంచి మరో ముగ్గురు బస్సెక్కారు. నగరానికి చెందిన హారిక బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ఇంజినీర్. బస్‌లో యూ16 బెర్త్ బుక్ చేసుకుంది. ప్రమాదం జరిగిన తర్వాత ఎవరో వెనుక వైపు బస్సు అద్దం పగలగొట్టడంతో అప్రమత్తమై అందులో నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నది. అలాగే, ఎస్సార్ నగర్ నుంచి కీర్తి (30) యూ8 లో, చరిత్ (21) యూ 13 బెర్త్బుక్చేసుకుని జర్నీ చేశారు. ఎర్రగడ్డ నుంచి పంకజ్(40) తన కోసం యూ 17, ఫ్రెండ్‌కోసం ఎల్ 2 ( 28) బుక్‌చేసి కలిసి ప్రయాణం చేశారు. కానీ, వీరి ఫోన్లు స్విచ్ఛాఫ్వస్తుండడంతో వీళ్లు ఎక్కడివారు? ఏమయ్యారన్న సంగతి తెలియరావడం లేదు.
ఆ నలుగురు ఏమైనట్టు ?
ప్రమాదం జరిగిన బస్సులో కుత్బుల్లాపూర్ నుంచి వెళ్లిన కొందరు ప్రమాదం నుంచి తప్పించుకోగా.. మరికొందరి వివరాలు తెలియడం లేదు. దీంతో వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. సూరారం బస్సు పాయింట్‌లో ప్రశాంత్(32), గుణసాయి(33), చింతల్‌లో వేణు గుండా(33), బహదూర్‌పల్లి చౌరస్తాలో సుబ్రమణ్యం (26) , గండిమైసమ్మలో సత్యనారాయణ (28) బస్సెక్కి బెంగళూరు బయలు దేరారు. కాగా, ప్రమాదం నుంచి సూరారం కాలనీకి చెందిన గుణసాయి బతికి బయట పడ్డాడు. కాగా, సూరారంలో బస్సెక్కిన అన్నారానికి చెందిన ప్రశాంత్, బహదూర్‌పల్లిలో బస్సెక్కిన సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ, వేణు గుండాల ఫోన్లు కలవడం లేదు.
అత్యంత బాధాకరం
బస్సు ప్రమాదం చాలా దురదృష్టకరం. 19 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా సానుభూతిని వ్యక్తం చేస్తున్న. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జవాబుదారీతనం చాలా అవసరం
బస్సు ప్రమాద ఘటనలో 19 మంది చనిపోవడం దురదృష్టకరం. ఈ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్న. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ చర్యలు తీసుకోవాలి. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. వెహికల్ మెయింటెనెన్స్ బాధ్యతతో పాటు, జవాబుదారీతనం చాలా అవసరం.
కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ
ప్రమాద ఘటన కలిచివేసింది
కర్నూల్ బస్సు ప్రమాద ఘటన విని ఎంతో బాధేసింది. బస్సు ప్రమాదంలో జరిగిన ప్రాణ నష్టం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.
ప్రధాని నరేంద్ర మోదీ
విషాదకర ఘటన
ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోయాం. ఇదొక విషాదకరమైన ఘటన. ప్రమాద విషయం తెలిసి చాలా బాధేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్న. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలి. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలి.
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే
