ఎటు చూసినా దట్టమైన పచ్చని చెట్లు.. గలగలా పారే నదులు, సరస్సులు.. రంగురంగుల పక్షుల కిలకిలరావాలు వింటూ.. ప్రకృతి అందాల మధ్య రివ్వున ఎగురుతున్న ఆ పక్షుల అందాలను బైనాక్యులర్స్, లెన్స్ కెమెరాల్లో తిలకిస్తూ పరవశించి పోతున్నారు బర్డ్ లవర్స్. ఉషోదయాన విదేశీ వలస పక్షుల కిలకిలరావాలతో హైదరాబాద్ నగరశివార్లలోని సరస్సులు మారుమోగుతుంటాయి.
బర్డింగ్ పాల్స్.. ‘హైదరాబాద్ బర్డింగ్ పాల్స్’ అంటే నగరంలోని పక్షుల జీవవైవిధ్యం, వలస పక్షుల సంచారం, పక్షి వీక్షకుల పరిశీలనల ద్వారా సిటీ పర్యావరణ స్థితిని అంచనా వేసే ఒక ప్రకృతి సూచికగా చెప్పొచ్చు. హైదరాబాద్‌కి చెందిన అయిన ఆడెపు హరికృష్ణ, రాజీవ్ ఖండేల్ వాల్లు బర్డ్ లవర్స్. వాళ్లిద్దరూ కలిసి 2014వ సంవత్సరం ఫిబ్రవరి 24న నగర శివార్లలోని అమీన్‌పూర్ సరస్సు కేంద్రంగా బర్డ్ వాక్కు శ్రీకారం చుట్టారు.
ఆనాడు కలిసిన కొందరు పక్షి ప్రేమికులతో ‘హైదరాబాద్ బర్డింగ్ పాల్స్’ అనే పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేశారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఉద్యోగులు, ఫొటోగ్రాఫర్లు, జర్నలిస్టులు, కళాకారులు, విద్యార్థులు.. ఇలా ఒకటేంటి అన్ని వర్గాలకు చెందిన పక్షి ప్రియులంతా వారంపాటు వారి వారి పనుల్లో బిజీగా ఉంటారు.
వాళ్లంతా ప్రతీ ఆదివారం ఉదయాన్నే ఆటవిడుపుగా ప్రకృతి ఒడిలో విహరిస్తూ పక్షులను తమ కెమెరాల్లో బంధిస్తూ ఒత్తిడి నుంచి ఒకింత ఊరట పొందుతుంటారు”అని చెప్పాడు హైదరాబాద్ బర్డింగ్ పాల్స్‌కు అధ్యక్షుడిగా ఉన్న హరికృష్ణ. ఈ ఏడాది ఇది12 ఏళ్లు చేసుకుంది.
574 బర్డ్ వాక్స్
తెలంగాణలోని బర్డింగ్ హాట్‌స్పాట్ అయిన మొకిలా ప్రాంతంలో మే 31న హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ 574వ బర్డ్ వాక్ జరిగింది. ఉదయం హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులు పెయింటెడ్ ఫ్రాంకోలిన్, ల్యాప్‌వింగ్, కౌజులు, ఇసుక కౌజుల వంటి కొన్ని నేల పక్షులను చూసి వాటిని తమ కెమెరాల్లో బంధించారు. మొకిలాలోనే కాదు ప్రతీవారం హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులు పోచారం, మంజీరా, నర్సాపూర్ అడవులు, అనంతగిరి హిల్స్, అమ్రాబాద్, కవ్వాల, అమీన్‌పూర్, గండిపేట వంటి తెలంగాణలోని ప్రముఖ బర్డింగ్ హాట్‌స్పాట్లలో బర్డ్‌వాక్ నిర్వహిస్తున్నారు.
ఇవే కాకుండా చించోలి వైల్డ్ లైఫ్ శాంక్చువరీ, మహబూబాబాద్‌లోని భీముని పాదం జలపాతం, జోగిపేట అన్నాసాగర్ లేక్.. ఇలా ఎన్నో ప్రాంతాలు వివిధ రకాల పక్షులకు హాట్‌స్పాట్‌గా మారాయి. బర్డ్‌వాక్ గురించి అధ్యక్షుడు హరికృష్ణ.. “హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ పెట్టిన నాటి నుంచి ఈ పన్నెండేళ్ల కాలంలో ప్రతీ వారం వారం బర్డ్ హాట్‌స్పాట్లలో నిర్వహించే బర్డ్‌వాక్ ఇప్పటి వరకు 574 సారి పూర్తి చేసుకోవడం దేశంలోనే అరుదైన నిరంతర బర్డ్ వాక్ కార్యక్రమాల్లో ఒకటి’’ అని చెప్పారు. సరిగ్గా పదిమందితో ప్రారంభమైన హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ నేడు12,500ల సభ్యులకు చేరింది. సోషల్ మీడియాలో ఈ బర్డ్‌వాక్ చూసి ఈ సంస్థలో చేరుతోన్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది” అన్నారు.
బర్డ్‌వాక్ డేటా రికార్డు..
‘‘వివిధ జాతుల పక్షులను చూస్తూ ప్రకృతి ఒడిలో నడవడం హైదరాబాద్ బర్డింగ్ పాల్స్‌కు ప్రాణం వంటిది” అంటారు ప్రధాన కార్యదర్శి రాజీవ్ ఖండేల్ వాల్. అంతేకాదు.. ‘‘12 ఏళ్లుగా నిర్వహిస్తున్న బర్డ్వాక్ల ద్వారా పక్షుల ఆరోగ్యం, వలస నమూనాలు, సరస్సుల జీవవైవిధ్యానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని సేకరిస్తున్నాం. బర్డ్ వాక్ రికార్డులను బీఎన్ హెచ్ ఎస్, ఈ– బర్డ్స్, అటవీ శాఖలతో పంచుకుంటున్నాం.
అమీన్‌పూర్ సరస్సు జీవవైవిధ్యాన్ని నమోదు చేసి, దానిపై ఆందోళన వ్యక్తం చేసిన తొలి బృందంగా హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ నిలిచింది. 2016వ సంవత్సరంలో దీనిని భారతదేశపు మొట్టమొదటి జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించడానికి దోహదపడిన కేసులో తాము సేకరించిన బర్డ్‌వాక్ డేటా ఒక భాగంగా నిలిచింది. అమీన్ పూర్ సరస్సును తాము కాలుష్యం బారిన పడకుండా తమ సభ్యులు చర్యలు చేపట్టాం” అన్నారు రాజీవ్.
సేవ్ నల్లమల
పులులు, వివిధ జాతులు పక్షులు, ప్రకృతి అందాలకు నెలవైన నల్లమల అడవుల పరిరక్షణ కోసం హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులు ‘సేవ్ నల్లమల’ ప్రచారం చేపట్టారు. పక్షి ప్రేమికులు నల్లమల, అమ్రాబాద్ అడవుల్లో ట్రెక్కింగ్ చేసి 300లకు పైగా పక్షిజాతులను నమోదు చేశారు. ఈ అడవి ఎందుకు ఒక పర్యావరణ నిధిగా మారిందో పక్షులను నమోదు చేయడం ద్వారా చూపించారు. కేబీఆర్ పార్క్, మృగవని, ఉస్మాన్ సాగర్ నుంచి బర్డింగ్ పాల్స్ సభ్యులు క్రమం తప్పకుండా అందించే పక్షి జాడల రిపోర్ట్లు, అటవీ ప్రాంతాల పరిరక్షణలో అటవీ శాఖకు సాయపడుతున్నాయి.
పక్షులపై పాకెట్ గైడ్!
తెలంగాణ పక్షులపై పాకెట్ గైడ్‌ను హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ రూపొందించి విడుదల చేసింది. ఈ పాకెట్ గైడ్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క విడుదల చేశారు. ‘‘పక్షుల పాకెట్ గైడ్ స్థానిక పక్షుల సమాచారాన్ని ప్రతి హైదరాబాదీ చేతికి అందించాలనేది మా ప్రయత్నమ’’ని హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ ప్రతినిధి నరేష్ చెప్పారు. పక్షుల పాకెట్ గైడ్‌ను ప్రస్తుతం తెలంగాణ స్కూల్స్, కాలేజీల్లో స్టూడెంట్స్ ఉపయోగిస్తున్నారు.
బిగ్ బర్డ్ డేలలో అవార్డులు
దేశవ్యాప్తంగా ప్రతీ ఏటా ఫిబ్రవరి నెలలో ఆదివారాల్లో ఢిల్లీ పక్షిప్రియులు బిగ్ బర్డ్ డేలు నిర్వహిస్తుంటారు. ఈ బిగ్ బర్డ్ డేలలో అత్యధికంగా 270 పక్షిజాతులను గుర్తించిన హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులు 2016, 2018, 2019 సంవత్సరాల్లో అవార్డులు పొందారు. తెలంగాణకు విదేశాల నుంచి ప్రతీ సీజన్లో వలస వస్తున్న పక్షులతోపాటు స్థానిక పక్షిజాతులను పరిరక్షించుకోవాలనే లక్ష్యంతో హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ పనిచేస్తోంది. బర్డ్‌వాక్ చేయడమే కాకుండా చెరువుల్లో చెత్తను తొలగించడం, మొక్కలు కూడా నాటుతున్నారు.
అంతేకాదు.. ‘బర్డ్‌వాక్‌లో పాల్గొనాలనుకుంటే, సోషల్ మీడియాలో మమ్మల్ని సంప్రదించండి’ అంటున్నారు హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ నిర్వాహకులు. లేదంటే వాళ్ల సోషల్ మీడియా వేదికల ద్వారా సంప్రదించొచ్చు. వాళ్లకు సంబంధించిన ఫేస్ బుక్, ఎక్స్, ఇన్ స్టాగ్రామ్ గ్రూపుల్లో వివిధ జాతుల పక్షుల చిత్రాలు, పక్షుల సహజ వన్య ఆవాసాలను ఎంటర్ చేయొచ్చు.
ఉరుకుల పరుగుల నగర జీవితానికి కాసేపు విరామం ఇచ్చి, ప్రకృతి ఒడిలో పక్షుల కిలకిలరావాల మధ్య సేదతీరడం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులకు బాగా తెలుసు. వేకువజామున సరస్సులు, అడవులు, గడ్డి మైదానాల్లో అడుగులు వేస్తూ అరుదైన పక్షుల అందాలను ఆస్వాదించడం మాత్రమే కాదు, వాటి సంరక్షణ కోసం సమాజంలో చైతన్యం కల్పించడం కూడా ఈ గ్రూప్ లక్ష్యం.
పదిమంది బర్డ్ లవర్స్‌తో మొదలైన ఈ ప్రయాణం నేడు 12,500 మందికి పైగా సభ్యులతో దేశంలోనే అతిపెద్ద, అత్యంత చురుకైన బర్డింగ్ కమ్యూనిటీలలో ఒకటిగా ఎదిగింది. పన్నెండేళ్లలో 574 బర్డ్వాక్స్ నిర్వహించి ప్రత్యేక గుర్తింపు పొందిన హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ ప్రస్థానంపై ‘లైఫ్’ స్పెషల్ స్టోరీ.
పక్షుల మనుగడ ప్రశ్నార్థకం
తెలంగాణలోని అటవీ ప్రాంతాలతోపాటు హైదరాబాద్ నగర శివార్లలోని వందలాది సరస్సులు, జలపాతాలు, నదుల తీరాల్లో 400 జాతులకు పైగా పక్షులున్నాయి. నాడు ‘బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన సలీం అలీ కూడా హైదరాబాద్ నగరంలోని బర్డ్ హాట్స్పాట్లను సందర్శించి పరిశోధనలు చేశారు. అయితే సరస్సుల కబ్జాలు, పక్షుల నివాసాలకు విఘాతం వాటిల్లడంతోపాటు వ్యవసాయ పంటలపై పురుగుమందుల వాడకం పెరగడం వల్ల వివిధ రకాల పక్షుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
‘‘ఇళ్లలోనూ గూళ్లు కట్టే పిచ్చుకలైతే కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో ఆవాసాలు లేక నుంచి అంతర్ధానం అయ్యాయి. పిచ్చుకలే కాదు వివిధ విదేశాల నుంచి వచ్చే వలస పక్షుల రాక కూడా తగ్గిపోయింద’’ని అంటున్నారు పక్షి శాస్త్రవేత్త డాక్టర్ ఎనగందుల వెంకట్. ‘‘లేక్ సిటీగా పేరొందిన హైదరాబాద్‌లో నాటి సరస్సులు నేడు కబ్జాలతో కుచించుకుపోయాయి.
గతంలో కవ్వాల అభయారణ్యంలోని సరస్సుల్లోనూ అరుదైన పక్షులు కనువిందు చేసేవి. కానీ నేడు కాలుష్యం కాటుతో అవి తగ్గిపోయాయి’’ అన్నారాయన. వేకువజామున హైదరాబాద్ సరస్సుల్లో ఎగిరే పక్షుల కిలకిలరావాలు నగర పర్యావరణ ఆరోగ్యానికి అద్దం పడుతున్నాయి. వలస పక్షుల రాక, స్థానిక పక్షుల సంచారం, బర్డ్ వాచర్ల పరిశీలనలతో నగరంలోని ‘బర్డ్ పల్స్’ స్పష్టమవుతోంది.
ఒకవైపు వందల సంఖ్యలో పక్షి జాతులు నమోదవుతుండగా, మరోవైపు సహజ ఆవాసాల క్షీణత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే నగర విస్తరణ, సరస్సుల ఆక్రమణలు, కాలుష్యం, ‘బ్యూటిఫికేషన్’ పేరుతో సహజ ఆవాసాల మార్పులు వలస పక్షుల సంఖ్యపై ప్రభావం చూపుతున్నాయని పక్షి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఫ్లెమింగోలు, బార్ - హెడెడ్ గీస్ వంటి వలస పక్షులతో కళకళలాడిన కొన్ని నీటి వనరులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి.
