
- 7వ తేదీ నుంచి మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ముందస్తు చర్యలు
- 4వ తేదీ నుంచే పోలీసుల ఆధీనంలోకి హైటెక్స్, స్టార్‌హోటల్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మిస్ వరల్డ్–2025 పోటీల నిర్వాహణ కోసం అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పహల్గాం ఘటన, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించనున్నారు. ఈ నెల 7 నుంచి 31 తేదీ వరకు ఈ పోటీలు జరగనున్న సందర్భంగా.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిఘా పెంచారు.
హెటెక్స్ ఎగ్జిబిషన్‌లో జరగనున్న ఈవెంట్ ప్రారంభానికి 3 రోజుల ముందు నుంచే పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. ఇందుకోసం డీజీపీ జితేందర్ పర్యవేక్షణలో అడిషనల్ డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక టీమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి గురువారం నుంచి కోర్డినేషన్ మీటింగ్‌లు నిర్వహించనున్నారు.
పోలీసుల నిఘాలో పోచంపల్లి, రామప్ప
పహల్గాం ఘటన తరువాత హెచ్‌ఐసీసీ కేంద్రంగా భారత్ సమిట్–2025 జరిగిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు జరిగిన సమిట్ సందర్భంగా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే మిస్ వరల్డ్ పోటీలు జరిగే హైటెక్స్ సహా విదేశీయులు బస చేసే శంషాబాద్, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్‌లోని స్టార్ హోటల్స్ వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.