జోరు తగ్గిన కారు .. గ్రేటర్ క్యాడర్ ​బేజారు.. కార్యకర్తలున్నా జోష్​ నింపని లీడర్లు

జోరు తగ్గిన కారు .. గ్రేటర్ క్యాడర్ ​బేజారు.. కార్యకర్తలున్నా జోష్​ నింపని లీడర్లు
  • గత అసెంబ్లీ ఎన్నికల్లో 15 స్థానాల్లో గెలుపు 
  •  కాంగ్రెస్​అధికారంలోకి రాగానే ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్​ 
  • ఎవరి నియోజకవర్గాల్లో వాళ్లు
  • అనారోగ్యంతో జిల్లా అధ్యక్షుడు 
  • నడిపించే నాయకుడు కరువు 

హైదరాబాద్​సిటీ, వెలుగు: గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్​సిటీ పరిధిలో అత్యధిక స్థానాలు గెల్చుకున్న బీఆర్ఎస్​ప్రస్తుతం నిద్రావస్థలో ఉంది. ఎన్నికలకు ముందు ఓ వెలుగు వెలిగిన ఆ పార్టీ, ఇప్పుడు పలు కారణాలతో వెనకబడిపోతోంది. మెజారిటీ స్థానాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా, క్యాడర్​పటిష్టంగా ఉన్నా నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. హేమాహేమీలైన లీడర్లు ఉన్నా కార్యక్రమాల నిర్వహణకు చొరవ తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 

బీఆర్ఎస్​ప్రభుత్వ హయాంలో నగరం నుంచి ఇద్దరు మంత్రులుగా, ఒకరు డిప్యూటీ స్పీకర్​గా ఉన్నారు. ఇప్పుడు వారు పట్టీపట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనికితోడు పార్టీ అధినేత కుటుంబంలో జరుగుతున్న అంతర్గత పోరు గ్రేటర్​లో క్యాడర్​ను అయోమయంలో పడవేస్తున్నది. ఈ క్రమంలో హైదరాబాద్​పరిధిలో ఆపార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్నది. 

పార్టీ మారిన కార్పొరేటర్లు.. వీక్ అయిన పార్టీ ​ 

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​39 స్థానాలు గెలుచుకోగా, ఇందులో 15 మంది గ్రేటర్​నుంచే విజయం సాధించారు. రాష్ట్రంలోని వ్యాప్తంగా చాలా జిల్లాల్లో పార్టీ ఓటమి పాలైనా నగరంలో మాత్రం సత్తా చాటింది. ఇక్కడ తమ పట్టు ఎంత ఉందో చెప్పకనే చెప్పింది. గ్రేటర్​పరిధిలో కాంగ్రెస్​కు పెద్దసంఖ్యలో క్యాడర్​ఉన్నా గత ఆ ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. 

ఎన్నికలకు ముందు జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్​కు 55 మంది కార్పొరేటర్లు ఉండగా, ఎన్నికల తర్వాత 12 మంది కాంగ్రెస్, బీజేపీల్లోకి జంప్​అయ్యారు. దీంతో చాలా డివిజన్లలో ఆ పార్టీ వీక్​అయిపోయింది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నా ఇద్దరు ముగ్గురు మినహా ఎవరూ యాక్టివ్​గా పని చేయడం లేదు.  

ఇద్దరు జంప్.. మరో ఇద్దరు పక్క చూపులు  

గత ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి టి.పద్మారావు, సనత్​నగర్​నుంచి తలసాని శ్రీనివాస్​యాదవ్, అంబర్​పేట నుంచి కాలేరు వెంకటేశ్, ఉప్పల్​నుంచి బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్​నుంచి డి.సుధీర్​రెడ్డి, మల్కాజిగిరి నుంచి మర్రి రాజశేఖర్​రెడ్డి, కుత్బుల్లాపూర్​నుంచి వివేకానంద, శేరిలింగంపల్లి నుంచి అరికెపూడి గాంధీ , కూకట్​పల్లి నుంచి మాధవరం కృష్ణారావు, జూబ్లీహిల్స్​నుంచి మాగంటి గోపీనాథ్, ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, మహేశ్వరం నుంచి సబితారెడ్డి, పటాన్​చెరు నుంచి మహిపాల్​రెడ్డి, ముషీరాబాద్​నుంచి ముఠా గోపాల్, రాజేంద్రనగర్​ నుంచి ప్రకాశ్​గౌడ్ విజయం సాధించారు. 

అయితే ప్రభుత్వం మారగానే ఖైరతాబాద్​ఎమ్మెల్యే దానం నాగేందర్​, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు. రాజేంద్రనగర్​ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్​కాంగ్రెస్​అధినాయకత్వంతో సంప్రదింపులు జరిపారన్న వార్తలు వచ్చాయి. సీఎం రేవంత్​రెడ్డిని కలవడంతో పార్టీ మారతారనే చర్చ నడిచింది. అయితే, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశానని చెప్పినా, కాంగ్రెస్​కు అనధికారికంగా మద్దతు ఇస్తున్నట్టు ప్రచారం 
జరుగుతోంది. 

కొత్త కార్యవర్గంపై దృష్టి!

జిల్లాల వారీగా పార్టీ కార్యవర్గాలను ఏర్పాటు చేస్తామని ఇటీవల పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన నేపథ్యంలో గ్రేటర్​ హైదరాబాద్​లోని చాలా మంది అధ్యక్షపదవి తమకే కావాలని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న మాగంటి అనారోగ్య కారణాలతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండడంతో సికింద్రాబాద్, సనత్​నగర్, ఖైరతాబాద్, కూకట్​పల్లి, శేరిలింగంపల్లి వంటి నియోజకవర్గాల నుంచి కొందరు పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారు. 

అయితే అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర కావస్తోందని, పార్టీని ముందుకు నడిపించే సత్తా ఉన్నవారిని గుర్తించి అధ్యక్ష పదవి కట్టబెడితే మూడున్నరేండ్లలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందని సీనియర్​కార్యకర్తలు అంటున్నారు. అయితే, కేటీఆర్​ఆశీస్సులున్న వారికే గ్రేటర్​అధ్యక్ష పదవి వరించే అవకాశం కనిపిస్తోంది.  

కవిత పరిణామాలతో కంగారు..

ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్, పలువురు కార్పొరేటర్లు పార్టీ మారడంతో స్థానికంగా వీక్​అయిన బీఆర్ఎస్​ప్రస్తుతం కవిత పరిణామాలతో కంగారు పడుతోంది. పార్టీ అధినేత, తండ్రి కేసీఆర్​కు ఆమె ‘డాడీ’ అంటూ లెటర్ రాయడం, అందులోని నెగటివ్, పాజిటివ్​అంశాలను రాయడంతో ఏం జరుగుతుందోనన్న చర్చ క్యాడర్​లో మొదలైంది. యూఎస్​నుంచి శంషాబాద్​ఎయిర్​పోర్టుకు వచ్చాక ఆమె చేసిన కామెంట్స్​పార్టీలో నెలకొన్న అంతర్గత విబేధాలను ఎత్తి చూపింది. 

జాగృతి రూపంలో గ్రేటర్​లో కవితకు బలమైన ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె వెంట నడిచే ముఖ్య లీడర్లకు మహానగరంలో కొదువ లేదు. ఈ క్రమంలో ఆమె ఒక వేళ వేరే పార్టీ మారినా, కొత్త పార్టీ పెట్టినా గ్రేటర్ బీఆర్ఎస్​రెండుగా చీలిపోయే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

అనారోగ్యంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూరం 

గ్రేటర్​హైదరాబాద్​బీఆర్ఎస్​అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​అనారోగ్యంతో చాలా కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో మంత్రిగా సిటీలో హవా చాటిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​కూడా స్తబ్ధుగానే ఉన్నారు. కొన్ని పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటూ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా, మంత్రిగా పని చేసిన పద్మారావు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కాస్తో కూస్తో పేరున్న సుధీర్​రెడ్డితో పాటు మిగతా వారంతా తమ తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. 

మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితారెడ్డి మాత్రమే రాష్ట్ర స్థాయి అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల వరంగల్​లో నిర్వహించిన పార్టీ ప్లీనరీకి కూడా గ్రేటర్​నుంచి పెద్దగా క్యాడర్​కదలలేదు. రాష్ట్ర స్థాయిలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించడంలోనే ఎమ్మెల్యేలు నిమగ్నం కాగా, పార్టీ కార్యక్రమాలు లేక క్యాడర్​అయోమయానికి గురవుతున్నది. అంతే కాకుండా ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిణామాలతో ఏ ఎమ్మెల్యే ఎప్పుడు కాంగ్రెస్​పార్టీలోకి జంప్​అవుతారో అన్నది తెలియడం లేదు.