హైదరాబాద్, వెలుగు: ఆన్లైన్ ట్రేడింగ్‌లో అధిక లాభాలు వస్తాయంటూ ఓ వ్యాపారిని నమ్మించిన సైబర్ మోసగాళ్లు ఏకంగా రూ.12.31 కోట్లు కొల్లగొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. తొలుత రూ.10 వేలు పెట్టుబడి పెట్టించిన నిందితులు.. విడతల వారీగా లక్షల్లో వసూలు చేశారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు శుక్రవారం టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆఫీసర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ ప్రగతినగర్‌కు చెందిన వ్యాపారి దిలీప్ తమ్మిరెడ్డి (35)కి ఈ ఏడాది మార్చి 2న అర్జున్ అనే వ్యక్తి వాట్సాప్ ద్వారా పరిచయమయ్యాడు. ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్‌లో బాధితుడి వివరాలు గుర్తించినట్లు చెప్పి, తాను ట్రేడింగ్ నిపుణుడినని పరిచయం చేసుకున్నాడు. అధిక లాభాలు వస్తాయని నమ్మించి, మార్చి 10న రూ.10 వేలతో పెట్టుబడులు ప్రారంభించేలా చేశాడు. అనంతరం పలు బ్యాంకు ఖాతాల వివరాలు పంపి విడతలవారీగా రూ.15,39,04,853 బదిలీ చేయించుకున్నాడు.
నమ్మకాన్ని పెంచేందుకు ఇందులో రూ.3,07,46,000ను విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత మిగతా డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు శుక్రవారం టీజీసీఎస్బీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
