
- ఆన్ లైన్ లో ఇన్సూరెన్స్ ప్రీమియం పేరుతో దోపిడీ
- తీహార్ జైల్లో ప్లాన్
- నిందితుడి అరెస్ట్
‘తీహార్ జైల్లో దోస్తీ కట్టారు. ఇన్సూరెన్స్ ప్రీమియంలో డిస్కౌంట్ అన్నారు. ఖాతా వివరాలు చెప్పి అమౌంట్ కొట్టేశారు. నేషనల్ బ్యాంక్ అకౌంట్స్ తో అందిన కాడికి దోచేశారు. పోలీసులకు చిక్కి చంచల్ గూడ జైలు కెళ్లారు’.
హైదరాబాద్, వెలుగు: సైబర్ మోసగాళ్ళకు బ్యాంక్ అకౌంట్స్ అందిస్తున్న అంతర్రాష్ట్ర నేరస్తుడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూ ఢిల్లీ అడ్డాగా ఇన్సూరెన్స్ పేరుతో మోసాలు చేస్తున్న నిందితుడి వివరాలను జాయింట్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు.
10 శాతం డిస్కౌంట్ అంటూ..
హైదరాబాద్ కి చెందిన ఓ మహిళ కు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ప్రీమియం చెల్లింపులో భాగంగా రూ.59,511 ఏటా జనవరి ఫస్ట్ వీక్ లో కట్టేది. గత నెల 3న ఆ మహిళకు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రతినిధులుగా చెప్తూ ఓ కాల్ వచ్చింది. ప్రీమియం,పేమెంట్స్ వివరాలను తెలిపారు. ప్రీమియం చెల్లింపులు తమ సంస్థకు చెందిన నేషనల్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా చెల్లించాలన్నారు. ఇందుకోసం నేషనల్ బ్యాంక్స్ నుంచి ట్రాన్స్ ఫర్ అయ్యే ప్రీమియంపై 10 శాతం డిస్కౌంట్ ఉంటుందని నమ్మించారు. ఏటా చెల్లించే రూ. 59,511 ప్రీమియంలో కేవలం రూ53,332 చెల్లించాలని సూచించారు.
జైలు పరిచయంతో..
యూపీలోని సుక్ పూర్ కి చెందిన వినీత్ సింగ్(23) హర్యానా ఫరీదాబాద్ లో ఉంటూ జొమాటో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. 2018లో జైపూర్ లో జరిపిన ఓ దాడి కేసులో తీహార్ జైలులో రిమాండ్ కి వెళ్లాడు. ఈ క్రమంలో ఆన్ లైన్ చీటింగ్ కేసులో అరెస్ట్ రిమాండ్ ఖైదీగా ఉన్న మరో వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరూ బయటికి వచ్చాక బ్యాంక్ అకౌంట్లను సేకరించి కమిషన్ బేసిస్ లో సైబర్ నేరగాళ్ళకు సప్లయ్ చేసేందుకు ప్లాన్ చేశాడు.
కర్నాటక బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ తో పాటు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో వినీత్ సింగ్ ఫ్రెండ్ పేరుతో అకౌంట్స్ ఓపెన్ చేశాడు. ఇలా ఓపెన్ చేసిన అకౌంట్స్ నుంచి చెక్ బుక్స్, ఏటీఎం కార్డ్స్ ఆన్ లైన్ చీటర్లకు అందించాడు. అందుకోసం ఒక్కో అకౌంట్ కి రూ.15వేలు తీసుకున్నాడు. ఆ తరువాత జరిగే ఆన్ లైన్ చీటింగ్ ట్రాన్సాక్షన్స్ కి 20 శాతం కమీషన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఇలా మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్లనే టార్గెట్ చేసి సైబర్ ముఠాలో వినీత్ సింగ్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా సభ్యుల కోసం పోలీసులు ఢిల్లీలో గాలిస్తున్నారు.
బ్యాంక్ లో డిపాజిట్ చేయించుకుని..
కర్నాటక నేషనల్ బ్యాంక్ కి చెందిన ఢిల్లీ అకౌంట్ నంబర్ 6332500100258301 బాధితురాలికి అందించారు. దీంతో సైబర్ నేరగాళ్ళు చెప్పిన విధంగా బాధితురాలు తన ప్రీమియం అమౌంట్ రూ.53,332 ట్రాన్స్ ఫర్ చేసింది. ప్రీమియం చెల్లించానని భావించిన బాధితురాలికి పెండింగ్ ప్రీమియం చెల్లించాలని మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో షాక్ కు గురైన బాధితురాలు కస్టమర్ కేర్ కి కాల్ చేసి విషయం తెలుసుకుంది. తను మోసపోయానని గుర్తించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.