తిరుమల లడ్డూ కల్తీ ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కలియుగ దైవం వెంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగిందని.. అందులో నిషేదిత జంతు కొవ్వు వాడారని స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం సంచలనంగా సృష్టించింది.
ఈ క్రమంలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని న్యాయవాది రామారావు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయోధ్యకు పంపిన లడ్డూలో కల్తీనెయ్యి వాడినట్లు వ్యాఖ్యలు చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. తిరుమల లడ్డూ కల్తీపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ నుండి తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు ఆయన విజ్ఞప్తి చేశారు. న్యాయవాది రామారావు పిటిషన్‌పై సోమవారం (2024, అక్టోబర్ 21) విచారణ చేపట్టిన సిటీ సివిల్ కోర్టు.. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది. తిరుమల లడ్డూ కల్తీ ఇష్యూకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు 2024, నవంబర్ 22న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.