హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన హైదరాబాద్ కలెక్టర్​, జీహెచ్​ఎంసీ కమిషనర్​

హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన  హైదరాబాద్ కలెక్టర్​, జీహెచ్​ఎంసీ కమిషనర్​

చెరువుల ఆక్రమణల వ్యవహారంపై వివరాలు ఇవ్వకపోవడంపై వివరణ ఇచ్చే నిమిత్తం హైదరాబాద్‌‌ కలెక్టర్‌‌ డి.అనుదీప్, జీహెచ్‌‌ఎంసీ కమిషనర్‌‌ రోనాల్డ్‌‌ రాస్‌‌ బుధవారం హైకోర్టు విచారణకు హాజరయ్యారు. ఇద్దరు ఆఫీసర్లు బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో తదుపరి విచారణకు హాజరు నుంచి వారికి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. అనివార్య కారణాల వల్ల విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు రంగారెడ్డి కలెక్టర్‌‌ దాఖలు చేసిన అఫిడవిట్‌‌ను అనుమతించింది. 

తదుపరి విచారణకు హాజరు కావాలని చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే ఆధ్వర్యంలోని డివిజన్‌‌ బెంచ్‌‌ ఆదేశించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని చెరువుల రక్షణకు చర్యలు తీసుకోవడం లేదంటూ 2007లో అందిన లెటర్‌‌ను హైకోర్టు గతంలో పిల్‌‌గా తీసుకుంది.  కోర్టు కమిషనర్​గా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌‌ పరిశీలించి నివేదిక సమర్పించారు. ఆ నివేదికలో ఎలాంటి చర్యలు తీసుకున్నదీ అధికారులు వివరించకపోవడంతో ధర్మాసనం గతంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వాదనల తర్వాత ఆక్రమణల తొలగింపు చర్యల నివేదిక పరిశీలన కోసం విచారణను వచ్చే నెల 22కు వాయిదా  వేసింది.