లోపాలున్న ఎలక్ట్రిక్ కారు అమ్మిన BYD.. డీలర్‌కు హైదరాబాద్ కన్జ్యూమర్ కోర్టు షాక్!

లోపాలున్న ఎలక్ట్రిక్ కారు అమ్మిన BYD.. డీలర్‌కు హైదరాబాద్ కన్జ్యూమర్ కోర్టు షాక్!

సరిగ్గా పనిచేయని ఎలక్ట్రిక్ కారు అమ్మినందుకు మోదీ BYD, BYD ఇండియా కంపెనీలకు హైదరాబాద్ జిల్లా కన్జ్యూమర్ ఫోరం గట్టి ఆదేశాలు ఇచ్చింది. కారులోని సమస్యలను చెక్ చేయడానికి వెంటనే ఒక ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేయాలని చెప్పింది.

అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ 2024 నవంబర్ 13న రూ. 32లక్షల 57వేలు పెట్టి BYD ఎలక్ట్రిక్ కారు కొన్నది. అయితే కారు ఇచ్చినప్పుడు ఛార్జింగ్ పరికరాలు ఇవ్వలేదని.. వాటిని బిగించడానికి 17 రోజులు పట్టిందని కంపెనీ ప్రతినిధి జి. మహేశ తెలిపారు. దీనివల్ల కారు కొన్నా వాడుకోలేకపోయామని చెప్పారు.

కారు వాడటం మొదలుపెట్టినప్పటి నుంచే వెనుక సస్పెన్షన్, స్టీరింగ్ నుంచి వింత శబ్దాలు రావడం, ఏసీ పనిచేయకపోవడం వంటి సమస్యలు వచ్చాయట. నవంబర్ 28న డీలర్‌కు ఫిర్యాదు చేయగా టెక్నీషియన్లు సమస్యను సరిచేశామని చెప్పారని, అయినా శబ్దాలు తగ్గలేదని ఫిర్యాదులో వివరించారు. స్టీరింగ్ మెకానిజం నుంచి కూడా శబ్దాలు వస్తుండటంతో డిసెంబర్ 3, 2024న వాహనాన్ని మార్చాలని కోరినట్లు తెలిపారు. షోరూమ్‌లో ఎన్నిసార్లు రిపేర్లు చేయించినా అవి తగ్గలేదు. దీనికితోడు వారంటీ పేపర్లు, ఉచిత సర్వీస్ కూపన్లు, ఇతర డాక్యుమెంట్లు కూడా ఇవ్వకపోవడంతో సదరు కంపెనీ కన్జ్యూమర్ ఫోరాన్ని ఆశ్రయించింది.

ఈ కేసు విచారించిన కోర్టు.. కేవలం ఎక్కువసార్లు రిపేర్లు చేసినంత మాత్రాన కారు వెనక్కి తీసుకోవడం గానీ, పూర్తి డబ్బు వాపస్ ఇవ్వడం గానీ కుదరదని స్పష్టం చేసింది. కారు తయారీలోనే పెద్ద లోపం ఉందని నిపుణులు నిరూపించాల్సి ఉంటుందని తెలిపింది.

అందుకే నెల రోజుల్లోగా ఒక ఇండిపెండెంట్ టీమ్‌తో కారు ఏసీ, స్టీరింగ్, సస్పెన్షన్, ఛార్జింగ్ సిస్టమ్ అన్నీ చెక్ చేయించాలని ఫోరం ఆదేశించింది. రిపేర్ చేయగల లోపాలు ఉంటే ఆ తర్వాత 30 రోజుల్లోగా ఫ్రీగా బాగు చేసి, ఆ పార్ట్స్‌కు అదనంగా వారంటీ ఇవ్వాలని చెప్పింది. అంతేకాకుండా బాధిత కంపెనీకి రూ. 25వేలు నష్టపరిహారం, కేసు ఖర్చుల కింద రూ. 10వేలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది.