బషీర్బాగ్, వెలుగు: ఆపదలో ఉన్న ఎనిమిదేండ్ల బాలికను రక్షించిన యువకుడిని సిటీ సీపీ వి.సి. సజ్జనార్ అభినందించారు. సోమవారం బషీర్బాగ్లోని పాత సీపీ కార్యాలయంలో శాలువాతో సత్కరించి, ప్రశంసాపత్రం అందజేశారు. ఈ నెల 1న అబిడ్స్ ప్రాంతంలో స్కూల్ ముగిశాక ఇంటికి వెళ్తున్న బాలికను ఆటో డ్రైవర్ సలీమ్ మాయమాటలతో కిడ్నాప్ చేసి, గోల్కొండలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు.
అక్కడే ఉన్న మహ్మద్ ఫిరోజ్ బాలిక ఏడుపు విని అడ్డుకున్నాడు. ఆటో డ్రైవర్ను నిలదీయగా, అక్కడ్నుంచి పరారయ్యాడు. అనంతరం స్కూల్ ఐడీ కార్డు ద్వారా ఆమె తండ్రికి ఫిరోజ్ సమాచారం ఇచ్చి బాలిక అప్పగించాడు. ఈ ఘటనపై బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ నేపథ్యంలో నేరం జరుగుతున్నప్పుడు బాధ్యతాయుత పౌరుడిగా ఫిరోజ్ చూపిన ధైర్యం అందరికీ ఆదర్శమని సీపీ కొనియాడారు.
