కేరళలో హైదరాబాద్‌ డ్రగ్స్‌ ముఠా అరెస్ట్

కేరళలో హైదరాబాద్‌ డ్రగ్స్‌ ముఠా అరెస్ట్
  • సిటీ శివార్లలో ఎండీఎంఏ తయారీ    
  •  బెంగళూరు మీదుగా కేరళకు స్మగ్లింగ్
  • త్రిసూర్  పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో గుట్టురట్టు
  • కేరళకు చెందిన ఇద్దరు సహా ఆరుగురు అరెస్ట్​
  • రూ.2 కోట్లు విలువైన 2.04 కిలోల ఎండీఎంఏ పట్టివేత

హైదరాబాద్‌, వెలుగు: హైదరాబాద్ డ్రగ్స్ మూలాలు కేరళలో బయటపడ్డాయి. ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్మగ్లింగ్ ముఠాను పట్టుకుంటే.. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ తయారీ గుట్టు బయటపడింది. కేరళలోని త్రిసూర్‌ పోలీసులు, స్థానిక యాంటీ నార్కోటిక్స్‌ ఫోర్స్‌ పోలీసులు జాయింట్‌ ఆపరేషన్ చేపట్టి ఆరుగురు సభ్యుల ముఠాను మంగళవారం అరెస్ట్ చేయగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జులై 2న త్రిశూర్‌, ఒల్లూర్‌‌  పోలీసులు, డిస్ట్రిక్ట్‌ యాంటీ నార్కోటిక్స్‌ స్పెషల్ యాక్షన్  ఫోర్స్‌ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. కన్నూర్‌‌కు చెందిన ఫాజిల్‌ అనే వ్యక్తి కారును ఆపి తనిఖీ చేయగా, రూ.2 కోట్లు విలువ చేసే 2.4 కిలోల ఎండీఎంఏ దొరికింది. తర్వాత అలువ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. 

మరో 40 గ్రాముల ఎండీఎంఏను సీజ్ చేశారు. ఫాజిల్‌ ఇచ్చిన సమాచారంతో ఎండీఎంఏ తరలిస్తున్న బిజ్జు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. బిజ్జు ఇచ్చిన సమాచారంతో బెంగళూరుకు చెందిన సోమయ్య, ఏపీకి చెందిన రామారావును బెంగళూరులో అరెస్టు చేశారు. వీరిద్దరూ హైదరాబాద్‌ నుంచి బెంగళూరు‌ మీదుగా కేరళకు ఎండీఎంఏ స్మగ్లింగ్​చేస్తున్నట్లు గుర్తించారు. 

సోమయ్య, రామారావు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లో ఎండీఎంఏ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మహేందర్‌‌ రెడ్డి ద్వారా బెంగళూరుకు ఎండీఎంఏ స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. మహేందర్ రెడ్డి సమాచారంతో కూకట్‌పల్లిలోని  కేపీహెచ్‌బీలో నివాసం ఉంటున్న వెంకట నర్సింహరాజును అదుపులోకి తీసుకుని విచారించారు. సిటీ శివారులో ఎండీఎంఏ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నర్సింహరాజుతో పాటు మహేందర్ రెడ్డి, రామారావు, ఫాజిల్‌, బిజ్జు, సోమయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరిలించారు.

పబ్బుల్లో గంజాయి తీసుకొని చిందులు

ఆరుగురు అరెస్ట్.. శుక్రవారం అర్ధరాత్రి 25 పబ్బుల్లో సోదాలు
ఎక్సైజ్‌‌‌‌, టీజీ న్యాబ్‌‌‌‌ జాయింట్ ఆపరేషన్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఎక్సైజ్‌‌‌‌  ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌  అధికారులు పబ్బులలో గంజాయి, డ్రగ్స్  కస్టమర్లను పట్టుకున్నారు. టీజీ యాంటీ నార్కోటిక్స్‌‌‌‌  బ్యూరో(టీ న్యాబ్‌‌‌‌) అధికారులతో కలిసి ఎక్సైజ్  అధికారులు శుక్రవారం రాత్రి జాయింట్  ఆపరేషన్  చేశారు. ఎక్సైజ్  ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌  జాయింట్  కమిషనర్‌‌‌‌‌‌‌‌  మహ్మద్  ఖురేషి ఆధ్వర్యంలో  రాత్రి 11  నుంచి ఒంటి గంట వరకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్ లో ఏకకాలంలో 25 పబ్బుల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు.

130 మంది అనుమానితులకు డ్రగ్‌‌‌‌  టెస్ట్‌‌‌‌లు చేశారు. జూబ్లీహిల్స్‌‌‌‌లోని జోరా పబ్‌‌‌‌, క్లబ్  రోడ్‌‌‌‌, విస్కీ సాంబ పబ్బుల్లో ఆరుగురు కస్టమర్లు మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు గుర్తించారు. ఐదుగురు గంజాయి తీసుకోగా.. ఒకరు ఎండీఎంఏ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. పట్టుబడిన వారిని అభిషేక్‌‌‌‌  శ్రీవాస్తవ్‌‌‌‌ (విస్కీ సాంబ పబ్  డీజే  ఆపరేటర్‌‌‌‌), అబ్దుల్‌‌‌‌  ఘని (విద్యార్థి), శశావత్  మహాపాత్ర (ఐటీ  ఉద్యోగి), స్నేహ కచూస్‌‌‌‌, మధిల హరితభాను (విజయవాడ), మీర్  అబిద్  అలీగా గుర్తించారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.