మందు, మగువలతో పబ్బుల్లో గ‘మ్మత్తు’

మందు, మగువలతో పబ్బుల్లో గ‘మ్మత్తు’

హైదరాబాద్,వెలుగు: ఓ బేబీ యు ఆర్​ సో బ్యూటీ ఫుల్..​ ఫుల్.. అనే సాంగ్స్​తో పబ్​లలో డ్యాన్స్​ఫ్లోర్​దద్దరిల్లుతోంది. సిటీ పబ్బులలో అర్ధనగ్న నృత్యాలు, అశ్లీలతతో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరుతున్నాయి. వ్యాపార వేత్తలు, సంపన్నల కుటుంబాలు ఎక్కువగా ఉండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి వీఐపీ సెంటర్లను అడ్డాగా చేసుకుని పదుల సంఖ్యలో పబ్బులు ఏర్పాటయ్యాయి. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ అనుమతితో ఈ రెండు ఏరియాల్లోనే 35 దాకా పబ్​లు నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా సిటీ మొత్తంగా దాదాపు 60 వరకు పబ్బులుంటాయని సమాచారం. ఎలాంటి అనుమతులు లేని కొన్ని పబ్​లలో చీకటి దందా నడుపుతున్నట్టు తెలుస్తోంది. వీకెండ్  పార్టీలు, బర్త్ డే సెలెబ్రేషన్స్​తోపాటు ఎలాంటి వేడుకలైనా స్పెషల్ఆఫర్స్ పేరుతో నిర్వాహకులు యువతను ఆకర్షిస్తున్నారు.

క్లబ్ డ్యాన్సులు నిషేధించినా

క్లబ్​ డ్యాన్స్​లు నిషేధంలో ఉన్నప్పటికీ పలు పబ్​లలో అర్ధనగ్న ప్రదర్శలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి వ్యభిచారం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల బేగంపేట్ లెస్బాన్‌పబ్‌ ఆవరణలో డ్యాన్సర్ హరిణిపై జరిగిన దాడితో పలు అక్రమాలు బయటపడ్డాయి. ఈ పబ్ లో విశాలమైన ప్రాంగణం, డాన్సర్ల కోసం సెంట్రల్ ఏసీ, ప్రత్యేక స్టేజీ.. దాని చుట్టూ మద్యం సప్లయ్ కోసం టేబుళ్లను ఏర్పాటు చేశారు. స్టేజ్ పక్కనే చిన్న చిన్న గదులు కూడా ఉన్నాయి. సాధారణంగా పబ్​లలో రూమ్స్ కి అనుమతులుండవు. కేవలం మద్యం, స్నాక్స్ కు మాత్రమే అనుమతులుంటాయి. కానీ దానికి విరుద్ధంగా ఇక్కడ అమ్మాయిలు, రూమ్స్ ఏర్పాటు చేసి క్లబ్ డ్యాన్స్ లు, వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు బాధితురాలు హరిణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమాల్లో అవకాశం దొరక్కపోవడంతో లెస్బాన్‌పబ్‌ లో డ్యాన్సర్ గా చేరానని తెలిపింది.

ప్రశ్నిస్తే బౌన్సర్లతో దాడులు

ఆదివారం రాత్రి జరిగిన మరో ఘటన పబ్​లో విచ్చలవిడితనాన్ని తెలియజేస్తోంది. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన కార్తీక్‌రెడ్డి, నవీన్‌, శరత్‌చంద్రవర్మ జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి సమీపంలోని ఆమ్నీషియా లాంజ్​లో బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం వచ్చారు. పార్టీ ముగిసిన తర్వాత కొంతమంది వాష్ రూమ్ కి వెళ్లారు. టిష్యూ పేపర్ల విషయంలో రూపేష్, కార్తీక్ రెడ్డితో బౌన్సర్లు ఘర్షణకు దిగారు. బౌన్సర్ల దాడి విషయమై బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతొ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  అయితే పబ్​లలో ఎలాంటి గొడవలు జరిగినా బయటకు తెలిస్తే పరువు పోతుందని చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేయకుండా గమ్మునుంటున్నట్టు సమాచారం.