
– హైదరాబాద్ ఆడబిడ్డ నిధి మినియేచర్ ఆర్ట్
ప్రస్తుత యువతరాన్ని తెగ ఆకర్షిస్తోంది మినియేచర్ ఆర్ట్. అంటే చిన్నచిన్న బొమ్మలను తయారు చేయడమన్నమాట. వయొలిన్స్, టెడ్డీ బేర్స్, బొమ్మలు, గ్లోబ్స్ ఇలా రకరకాల బొమ్మలు ఇప్పటిదాకా ఆ ఆర్ట్‌లో ఒదిగిపోయాయి. కానీ లైఫే ఆ చిన్న బొమ్మల్లో ఇమిడిపోతే.. అదే చేసి చూపిస్తున్నారు హైదరాబాద్ బిడ్డ నిధి గుప్తా. ఇన్ స్టాగ్రామ్‌లో ఆమె బొమ్మలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కొందరు ప్రత్యేకంగా ఆర్డర్లిచ్చి తమకు కావాల్సిన మినియేచర్ ఆర్ట్‌ను తయారు చేయించుకుంటున్నారు.
ప్రస్తుతం డిగ్రీ చదువుకుంటున్న నిధి ‘టీనీ జీనీ’ పేరుతో సరిగ్గా ఏడాదిన్నర క్రితం ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ను తెరిచారు. ఇందుకు కారణం ఆమె ఫ్రెండ్. తన మినియేచర్ ఆర్ట్, ఫ్రెండ్‌కు విపరీతంగా నచ్చింది. దాంతో దీన్నే వ్యాపారంగా ఎందుకు మార్చకూడదన్న ఆలోచన వచ్చినట్లు నిధి తెలిపారు. అప్పటినుంచి ఇన్‌స్టాలో, ఆర్ట్ ఫొటోలను షేర్ చేస్తున్నట్లు చెప్పారు. కాలేజ్ ఫెస్ట్‌లో వుమెన్ పని సంస్కృతిపై మినియేచర్ ఆర్ట్స్ తయారు చేసినట్లు నిధి వెల్లడించారు. ఆ తర్వాత ఆర్డర్లు రావడం మొదలైందని వివరించారు. చిన్ననాటి నుంచి తనకు ఆర్ట్ అంటే ఇష్టమని చెప్పారు. 14 ఏళ్ల వయసులో తొలిసారి మినియేచర్ ఆర్ట్ వైపు ఆసక్తితో మళ్లినట్టు చెప్పారు. తన అక్క పెళ్లికి, ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్న ఉద్దేశమే లైఫ్ ఈవెంట్స్ ను ఆర్ట్ గా మలిచే ఆలోచనకు కారణమని చెప్పారు.