
- శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగించరాదని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ బండ్లగూడలోని నూరిషా షరీఫ్ దర్గా వద్ద ప్రార్థనలు చేసుకోవడానికి జామియా ఇలహియత్ ఇ నూరియాకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. శాంతిభధ్రతలకు భంగం కలగకుండా ప్రార్థనలు నిర్వహించుకోవాలని ఆదేశించింది. దర్గా వద్ద అక్టోబరు 2 నుంచి 7వ తేదీ వరకు సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు ప్రార్థనలకు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ జామియా ఇలహియత్ ఇ నూరియా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇదే దర్గా వద్ద మరొకరికి ప్రార్థనలకు అనుమతించినందున శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రార్థనలు చేసుకోవడానికి వక్ఫ్ ట్రిబ్యునల్ ఇరుపక్షాలకు అనుమతించినందున, పిటిషనర్‌ను అనుమతించాలని ఆదేశించారు. వేర్వేరు సమయాల్లో ప్రార్థనలు చేసుకోవాలని, దీనికి పరస్పరం సహకరించుకోవాలని ఇరు పక్షాలకు సూచించారు.