- ఓనర్‌షిప్ ఉంటేనే హిల్ట్ పాలసీ వర్తింపు
- లీజు భూములకు వర్తించదని క్లారిటీ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌ను మరింత నివాసయోగ్యంగా, విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకే ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్’ (హిల్ట్) పాలసీని తీసుకొచ్చామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ పాలసీ రూపకల్పనలో తాను కీలక పాత్ర పోషించానని, ఇది హైదరాబాద్‌కు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.
మంగళవారం అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై జరిగిన చర్చలో ఉత్తమ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. ‘‘హిల్ట్ పాలసీ అనేది పూర్తిగా స్వచ్ఛందం. మేం ఎవరినీ బలవంతపెట్టడం లేదు. దీన్ని తప్పనిసరి చేయాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయా?. పరిశ్రమలు స్వచ్ఛందంగా తరలివెళ్లేలా ప్రోత్సహించడమే మా ఉద్దేశం. ఈ పాలసీలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదు” అని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలవి అసత్య ఆరోపణలు..
కేవలం సంపూర్ణ యాజమాన్య హక్కులు ఉన్న భూములకు మాత్రమే ఈ పాలసీ వర్తిస్తుందని, లీజు భూములకు ఈ అవకాశం ఇవ్వబోమని ఉత్తమ్ స్పష్టం చేశారు. ‘‘ప్రతిపక్షాలు ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నాయి. రూ.5 లక్షల కోట్ల విలువైన 9 వేల ఎకరాలను కాజేస్తున్నారంటూ వాళ్లు చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధం. హైదరాబాద్‌తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. మేం పుట్టి పెరిగింది ఇక్కడే. మాకు ఈ సిటీతో ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఒకప్పుడు హైదరాబాద్‌లోని కీలక ప్రాంతాల్లో మాకు వ్యవసాయ భూములుండేవి. ఇప్పుడు మియాపూర్ వంటి ప్రాంతాల్లో బోరు నీళ్లు రంగు మారుతున్నాయి. కాలుష్య పరిశ్రమలు ఓఆర్ఆర్ దాటి వెళ్లాల్సిన అవసరం ఉంది. నడుస్తున్న పరిశ్రమలు బయటకు వెళ్లాలంటే.. వారికి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఎవరూ వెళ్లరు. అందుకే ఈ పాలసీని తీసుకొచ్చాం” అని తెలిపారు.
