హైదరాబాద్ ఇడ్లీ లవర్.. ఏడాదిలో రూ.6 లక్షల ఇడ్లీలు ఆర్డర్

హైదరాబాద్ ఇడ్లీ లవర్.. ఏడాదిలో రూ.6 లక్షల ఇడ్లీలు ఆర్డర్
  •     ‘ప్రపంచ ఇడ్లీ దినోత్సవం’ సందర్భంగా లెక్కలు విడుదల
  •     టాప్​ సేల్స్​ కలిగిన బ్రేక్​ఫాస్ట్​గా మసాలా దోశ

హైదరాబాద్​ :  హైదరాబాద్​కు చెందిన ఒక ఇడ్లీ లవర్​ స్విగ్గీలో తెగ ఆర్డర్లు ఇచ్చాడట. వాటి లెక్క ఎంతో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు. కేవలం ఒకే ఒక ఏడాది వ్యవధిలో అతడు రూ.6 లక్షల విలువ చేసే ఇడ్లీల కోసం ఆర్డర్స్​ పెట్టాడట. ఈవిషయాన్ని స్విగ్గీ కంపెనీ గురువారం వెల్లడించింది. ఆ ప్రియమైన కస్టమర్ ఏడాది టైంలో 8,428 ప్లేట్ల ఇడ్లీలు కొన్నాడని తెలిపింది. అతగాడు హైదరాబాద్​దాటి బెంగళూరు, చెన్నై  నగరాలకు వెళ్లినప్పుడు కూడా ఇడ్లీ కోసం ఆర్డర్స్ పెట్టడం ఆపలేదని​పేర్కొంది.

మార్చి 30న ‘ప్రపంచ ఇడ్లీ దినోత్సవాన్ని’ పురస్కరించుకొని ఈవివరాలను విడుదల చేశామని స్విగ్గీ తెలిపింది. 2022 మార్చి 30 నుంచి 2023 మార్చి 25 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా స్విగ్గీ ద్వారా ఫుడ్​ లవర్స్​ ఇచ్చిన ఇడ్లీ ఆర్డర్లను విశ్లేషించి ఈ ఆసక్తికర గణాంకాలను గుర్తించినట్లు వెల్లడించింది. గత 12 నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా 3.3 కోట్ల ప్లేట్ల ఇడ్లీ కోసం స్విగ్గీలో ఆర్డర్స్​ వచ్చాయని వివరించింది. దీన్నిబట్టి ఇడ్లీకి ఉన్న క్రేజ్​ను అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది. ఇడ్లీ ఆర్డర్స్​ ఎక్కువగా వస్తున్న టాప్​–3 సిటీస్​ జాబితాలో బెంగళూరు, హైదరాబాద్​, చెన్నై ఉన్నాయని తెలిపింది. వాటి తర్వాతి స్థానాల్లో ముంబై, కోయంబత్తూర్, పుణె, వైజాగ్​, ఢిల్లీ, కోల్​కతా, కొచ్చి ఉన్నాయని పేర్కొంది.

ప్రధానంగా ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య టైంలోనే ఇడ్లీల కోసం ఆర్డర్స్​ ఎక్కువగా వస్తున్నాయని చెప్పింది.  చెన్నై, హైదరాబాద్​,బెంగళూరు, కోయంబత్తూర్​, ముంబైలలోనైతే డిన్నర్​ టైంలోనూ ఇడ్లీ కోసం ఆర్డర్స్​ వస్తున్నాయని తెలిపింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడుల్లో నెయ్యి ఇడ్లీని, బెంగళూరులో రవ్వ ఇడ్లీని ఫుడ్​ లవర్స్​ ఎక్కువగా ఇష్టపడుతున్నారని పేర్కొంది.  స్విగ్గీలో బ్రేక్​ ఫాస్ట్​ కేటగిరీలో అత్యధిక ఆర్డర్స్​ మసాలా దోశకు వస్తుండగా.. దాని తర్వాతి స్థానంలో ఇడ్లీయే ఉందని  స్విగ్గీ  స్పష్టంచేసింది. హైదరాబాద్​లోని వరలక్ష్మి టిఫిన్స్, ఉడిపీస్​ఉపహార్​లు ఇడ్లీల కోసం ఫేమస్​ అని వెల్లడించింది.