హైదరాబాద్ ​సంపన్నుల ఇలాకా

హైదరాబాద్ ​సంపన్నుల ఇలాకా
  • భాగ్యనగరంలో 11,100 మంది మిలియనీర్లు
  • 12 ఏండ్లలో 78 శాతం మంది పెరుగుదల
  • అత్యంత ధనవంతులున్న సిటీల్లో ప్రపంచంలోనే 65వ స్థానం
  • ‘వరల్డ్​ వెల్తీయెస్ట్ ​సిటీస్​ రిపోర్టు 2023’లో వెల్లడి

వాషింగ్టన్‌ : ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్‌ 65వ స్థానంలో నిలిచింది. నగరంలో మొత్తం11,100 మంది మిలియనీర్లు ఉన్నట్లు ‘వరల్డ్​ వెల్తీయెస్ట్​ సిటీస్ ​రిపోర్టు 2023’ తెలిపింది. 2012 నుంచి 2022 మధ్య హైదరాబాద్‌లో ‘అత్యధిక నికర సంపదగల వ్యక్తుల’ సంఖ్య 78 శాతం పెరగడం విశేషం. ఈ జాబితాలో అమెరికాలోని న్యూయార్క్‌ సిటీ తొలి స్థానంలో నిలిచింది. 2022 డిసెంబరు31 నాటికి ఇక్కడ 3,40,000 మంది మిలియనీర్లు ఉన్నట్లు హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ అనే సంస్థ తన ‘అత్యంత సంపన్న నగరాల నివేదిక 2023’లో నిన్న వెల్లడించింది. మొత్తం 97 పట్టణాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 

టోక్యో సెకండ్​ప్లేస్

జపాన్‌ రాజధాని టోక్యో 2,90,300 మంది మిలియనీర్లతో రెండో స్థానంలో నిలిచింది. 2,85,000 మందితో శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా మూడో స్థానంలో ఉంది. లండన్‌, సింగపూర్‌, లాస్‌ ఏంజెల్స్‌, హాంకాంగ్‌, బీజింగ్‌, షాంఘై, సిడ్నీ తొలి పది నగరాల జాబితాలో ఉన్నాయి. భారత్‌ నుంచి 59,400 మంది మిలియనీర్లతో ముంబయి 21వ స్థానం దక్కించుకుంది. తర్వాత ఢిల్లీ 30,200 మిలియనీర్లతో 36వ స్థానంలో, బెంగళూరు12,600 మంది మిలియనీర్లతో 60వ స్థానంలో, కోల్‌కతా 12,100 మందితో 63వ స్థానంలో, హైదరాబాద్‌ 11,100 మందితో 65వ స్థానంలో ఉన్నాయి.