మ్యాన్​హోల్​లో విష వాయువులు పీల్చి.. ముగ్గురు కార్మికులు మృతి

మ్యాన్​హోల్​లో విష వాయువులు పీల్చి.. ముగ్గురు కార్మికులు మృతి
  • ఒకరిని కాపాడబోయి కన్నుమూసిన మరో ఇద్దరు  
  • దవాఖానలో చికిత్స పొందుతూ మరొకరు మృతి
  • హైదరాబాద్​లో  ఘటన 

మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్​లో మ్యాన్​హోల్​లో దిగి పనులు చేస్తున్న ముగ్గురు కార్మికుల ప్రాణాలు కోల్పోయారు. రక్షణ చర్యల విషయంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. కొంతకాలంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో అయ్యప్ప ఇన్​ఫ్రాస్ట్రక్చర్​కంపెనీ 1200 ఎమ్ఎమ్ పైప్ లైన్లను వేసే పనులు చేయిస్తోంది. ఇందులో భాగంగా పురానాపూర్ పాత బ్రిడ్జి సమీపంలో హనుమాన్ టెంపుల్ వద్ద మ్యాన్ హోల్స్​మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయి.

మహబూబ్​నగర్ కు  చెందిన రాములు (50), నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన హనుమంతు (42), వనపర్తికి చెందిన శీను (40) కార్మికులు గా ఈ పనులు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం హనుమాన్​టెంపుల్​వద్ద ఎనిమిది ఫీట్ల లోతు ఉన్న మ్యాన్​హోల్​లోకి రాములు దిగి క్లీన్​చేస్తుండగా, పైన హనుమంతు, శ్రీను ఉన్నారు. విషవాయుల ప్రభావంతో రాములు స్పృహ తప్పాడు. ఎంత పిలిచినా పలకకపోవడంతో హనుమంతు, శ్రీను లోపలకు దిగి రాములును పైన పడేశారు.

అయితే, హనుమంతు, శ్రీను కూడా మ్యాన్​హోల్​లో విషవాయువులు పీల్చడంతో అందులోనే చనిపోయారు. రాములును దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. విష వాయువుల ప్రభావం ఉంటుందని తెలిసినా సేఫ్టీ మెజర్స్​మెంట్స్​గురించి పట్టించుకోకపోవడం వల్లే ముగ్గురు చనిపోయారని మృతుల కుటుంబీకులు ఫిర్యాదు చేయడంతో అయ్యప్ప ఇన్​ఫ్రాస్ట్రక్చర్​కంపెనీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.