ఒక ఫొటో.. వేల కామెంట్లు! ---ఒక సాధారణ భోజనం.. అసాధారణ చర్చకు దారితీసింది. ఇద్దరు ముగ్గురు కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేయడం మామూలు విషయమే. కానీ అదే ఒక పనిమనిషి, డ్రైవర్‌లతో కలిసి భోజనం చేస్తే...? హైదరాబాద్‌లో జరిగిన ఓ ‘టీమ్ లంచ్’ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హైదరాబాద్‌కి చెందిన రచయిత నరేష్.. డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ కూడా. ఆయన ఓ రోజు తనతోపాటు వాళ్ల ఇంటి పనిమనిషి, డ్రైవర్ల కోసం టీం లంచ్ ఏర్పాటు చేశారు. లంచ్ పూర్తయ్యాక వాళ్లతో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది వైరల్ కావడంతో ఆన్ లైన్లో నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారి తీసింది.
టీం లంచ్‌పై విమర్శలు..
ఆ ఫొటో కింద ‘‘సంవత్సరాల తరబడి అలవాటుపడిన విధానం వల్ల మొదట్లో వాళ్లు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడానికి ఒప్పుకోలేదు. భారతదేశంలో ఈ వర్గ వ్యవస్థ పోవాలి. ఇక నుంచి రెండు నెలలకు ఒకసారి నేను నా సిబ్బందితో కలిసి ‘టీం లంచ్’ చేస్తాను’’ అని రాసుకొచ్చాడు. అయితే దీనికి నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘టీం లంచ్ మంచిదే.. కానీ కొందరు పనిమనుషులు మాత్రం దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
‘‘పబ్లిసిటీ కోసమే కదా ఇదంతా. ఇవన్నీ ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసి గొప్పలు చెప్పుకోవడం ఎందుకు? రీల్స్‌లో హ్యుమానిటీ యాంగిల్‌ని ప్రదర్శించుకోవడానికి నీ స్టాఫ్‌ని ఇలా వాడుకుంటున్నావు’’అంటూ మరో నెటిజన్ ఘాటుగా స్పందించాడు. ‘టీం లంచ్’పై అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పటికీ, మనుషుల మధ్య గౌరవం, సమానత్వం, పరస్పర ఆత్మీయత గురించి మరోసారి ఆలోచించేలా చేసింది. ప్రశంసించినా, విమర్శించినా.. ఈ ‘టీం లంచ్’ ఒక విషయాన్ని మాత్రం స్పష్టంచేసింది.
భోజనం కేవలం ఆకలి తీర్చడానికే కాదు, మనుషుల మధ్య ఉన్న కనిపించని గోడలను కూల్చడానికి కూడా ఒక వేదిక కావొచ్చు. అందుకే ఒక సాధారణ భోజనం ఇప్పుడు సోషల్ మీడియాలో అసాధారణ చర్చగా మారింది.
