హైదరాబాద్ మెట్రో భేష్: కేస్ స్టడీగా ఎంచుకున్న స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ

హైదరాబాద్ మెట్రో భేష్: 	కేస్ స్టడీగా ఎంచుకున్న స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైల్​ప్రాజెక్టు(హెచ్ఎంఆర్)కు అరుదైన గౌరవం దక్కింది. హెచ్ఎంఆర్ విజయగాథను అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ తమ స్టూడెంట్లకు, ప్రాక్టీషనర్లకు ఒక కేస్ స్టడీగా ఎంపిక చేసుకుంది. ఆ యూనివర్సిటీ ప్రచురించే స్టాన్‌ఫోర్డ్ సోషల్ ఇన్నోవేషన్ రివ్యూ(ఎస్ఎస్ఐఆర్) తాజా సంచిక(స్ప్రింగ్స్– 2024)లో ఈ కేస్ స్టడీని ప్రచురించింది. దీన్ని ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు దక్కిన అరుదైన గౌరవంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అభివర్ణించింది. ప్రపంచంలో చేపట్టిన పలు భారీ ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే అనేక సమస్యలు, వాటిని అధిగమించడానికి కావాల్సిన నాయకత్వ లక్షణాలు తదితర అంశాలపై తగిన సూచనలు, పరిష్కార మార్గాలను ఈ త్రైమాసిక జర్నల్ అందజేస్తుంది. ఐఎస్బీ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ రామ్ నిడుమోలు, ఆయన బృందం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై క్షుణ్ణంగా జరిపిన అధ్యయనాన్ని స్టాన్​ఫోర్డ్ సంస్థ కేస్ స్టడీగా ఎంచుకుని ప్రచురించింది. 

ఎన్వీఎస్ రెడ్డి విశేష కృషి..  

పీపీపీ విధానంలో చేపట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టు విజయవంతం కావడంలో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి బృందం అసాధారణ నాయకత్వ ప్రతిభను కనపరిచిందని అధ్యయనంలో పేర్కొన్నారు. మేటాస్ కన్సార్టియం వైఫల్యం, ప్రజా ఆందోళనలు, సామాజిక, రాజకీయ, మతపరమైన సవాళ్ళు, కోర్టు కేసుల వంటి ఎన్నో ఇబ్బందులను ఈ ప్రాజెక్టు ఎదుర్కొన్నదని వివరించారు.