రేపట్నుంచి ఎంఎంటీఎస్ సర్వీసుల పెంపు

రేపట్నుంచి ఎంఎంటీఎస్ సర్వీసుల పెంపు

హైదరాబాద్: జంట నగరాల పరిధిలో ప్రారంభమైన ఎంఎంటీఎస్ ప్యాసింజర్ రైళ్ల సర్వీసులు రేపు గురువారం నుంచి మరిన్ని పెరగనున్నాయి. జంట నగరాల పరిధిలో లక్షలాది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లు కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు ఏడాదిన్నరగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. గత ఏడాది మార్చి 22న తొలిసారి... ఆ తర్వాత రెండు రోజులకే లాక డౌన్ ప్రకటనతో షెడ్లకే పరిమితం అయిపోయాయి. దాదాపు 15 నెలలపాటు ఎంఎంటీఎస్ సిబ్బంది అందరూ వాహనాలు మొరాయించకుండా తరచూ సర్వీసింగ్ చేసుకుంటూ.. అప్పుడప్పుడు కొంత దూరం ట్రయల్స్ నడుపుకుంటూ వస్తున్నారు. సెకండ్ వేవ్ కరోనా లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేశాక ఇప్పుడు మళ్లీ మొదలయ్యాయి. 
అయితే ప్రజల నుంచి భారీ స్పందన వస్తుండడంతో ప్రస్తుతం మొదలైన 10 సర్వీసులకు తోడు అదనంగా 45 సర్వీసులు రేపట్నుంచి నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ట్విట్లర్ లో  అదనపు సర్వీసుల వివరాలు ప్రకటించింది. లింగంపల్లి  నుంచి హైదరాబాద్, ఫలక్ నుమా నుంచి లింగంపల్లి/రామచంద్రాపురం మధ్య ఎంఎంటీస్ రైళ్లు పునరుద్ధరించారు. తెల్లవారుజామున 5.40కి తొలి సర్వీసు ప్రారంభం అవుతుంది. రాత్రి 10.45కి చివరి సర్వీసు ఉంటుంది. రాత్రి 11.30కి గమ్యస్థానాలకు చేరుకునేలా ఎంఎంటీఎస్ రైళ్లు నడవనున్నాయి.