ఇల్లూ వాకిలి వదిలి.. పునరావాస కేంద్రాలకు.. మూసీ ముంచెత్తడంతో హైదరాబాద్లో ఇది పరిస్థితి..

ఇల్లూ వాకిలి వదిలి.. పునరావాస కేంద్రాలకు.. మూసీ ముంచెత్తడంతో హైదరాబాద్లో ఇది పరిస్థితి..

సాయంత్రం వరకు ఆ కాలనీలు సందడిగా ఉన్నాయి. కొందరు బతుకమ్మ కోసం రెడీ అవుతుండగా.. కొందరు టీవీ చూస్తూ గడుపుతున్నారు. ఒకవైపు  వర్షం వస్తున్నా పిల్లలు తడుస్తూనే కేరింతలు వేస్తూ ఆటలాడుతూ ఉన్నారు. అమ్మలక్కలు రాత్రి కోసం వంటలకు సిద్ధమవుతుంటే.. అప్పుడే పనులు ముగించుకుని వచ్చిన వాళ్లు సేద తీరేందుకు సిద్ధం అవుతున్నారు.. కానీ కాసేపట్లో ఈ వాతావరణం అంతా మారింది. ఒక్కసారిగా కాలనీలోకి మురుగు నీరు వచ్చి చేరడంతో ఏడుపులు, అరుపులతో సామాన్లు సదురుతూ భయంభయంగా ఇళ్లను వదిలి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి.

ఇది ముసారాంబాగ్ పరిసర బస్తీల్లోని సిచువేషన్.  హైదరాబాద్ లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల గేట్లు ఓపెన్ చేయడంతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. సుడులు త తిరుగుతూ వరద మోత మోగుతూ ఒక్కసారిగా వరద నీరు రావడంతో మూసీ ని ఆనుకుని ఉన్న బస్తీలు బురదమయం అయ్యాయి. కాలనీలు మునిగి పోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని ప్రజలను తరలించే పనిలో పడ్డారు. 

అప్పటి దాకా మన ఇంట్లో మనం ఉన్నాం అనే ధీమాలో ఉన్న బస్తీ వాసులు.. ఉన్నట్లుండి ఇల్లూ  వాకిలి వదిలి పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సిపరిస్థితి వచ్చింది. మూసీ నదిలో పెరిగిన నీటి ప్రవాహం తో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వెయ్యి మందికి పైగా ప్రజలను తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించారు . క్షేత్ర స్థాయిలో పరిస్థితిపై  ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్.

శంకర్ నగర్ ఏరియాలోని షహజాదీ మజీద్ లో దాదాపు 500 మందికి పునరావాసం ఏర్పాటు చేశారు. 150 మందిని మలక్ పేట్ సర్కిల్ లోని మూసా నగర్ కమ్యూనిటీలో హాల్ కు చేర్చారు. అంబేద్కర్ నగర్, దుర్గా నగర్ లకు చెందిన 45 కుటుంబాలను లంకా ప్రభుత్వ స్కూల్ కు తరలించారు. 32 మందిని గోల్నాక లోని కృష్ణా నగర్ కమ్యూనిటీ హాల్ కు చేర్చారు అధికారులు. భూలక్ష్మీ టెంపుల్ ఏరియాలోని మరో 55 మందిని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్ కు తరలించారు.