వెలుగు ఓపెన్ పేజీ.. పెన్షనర్ల హక్కులను కాపాడాలి

 వెలుగు ఓపెన్ పేజీ.. పెన్షనర్ల హక్కులను కాపాడాలి

2004  జనవరి 1 తర్వాత  నియామకమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ వర్తించదని,  వారు కాంట్రిబ్యూటరీ  పద్ధతిలో  కొత్త పెన్షన్ విధానం కిందికి వస్తారని కేంద్రం ఆదేశించింది.  2004  సెప్టెంబరు 1 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం కూడా అవే ఆదేశాలను అమలుచేయడంతో కొత్త ఉద్యోగులంతా  కొత్త పెన్షన్ విధానం పరిధిలోనికి వచ్చారు.  పాత పెన్షన్ విధానం గత ఉద్యోగులకే పరిమితమై, నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరే ఐఏఎస్ అధికారుల నుంచి అటెండర్ల వరకు కొత్త పెన్షన్ విధానంతో  రిటైరైన తర్వాత  పెన్షన్  సౌలభ్యం లేని పరిస్థితి ఏర్పడింది.

అంతేకాకుండా కొత్త వేతన  సవరణ  కమిషన్  సిఫార్సులను 2026 తర్వాత రిటైర్ అయ్యే ఉద్యోగులకే వర్తిస్తాయని,  ఇక నుంచి పాత పెన్షనర్లకు పెంచిన వేతన సవరణగాని,  డీఏలుగాని  వర్తించవని  ‘2025 ఆర్థిక బిల్లు‘లో  కొత్తగా చట్టం చేసింది.  ఇప్పటికే  2004  తర్వాత  నియామకమైన ఉద్యోగులకు పెన్షన్ కోల్పోయిన నేపథ్యంలో,  పాత పెన్షన్​దారులకు వేతన సవరణలు, డీఏ పెరుగుదలలు వర్తించవనే వాస్తవాలతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా పెన్షన్ హక్కు కోసం పోరాడిన ధరం స్వరూప్ నకారా (డి.ఎస్. నకారా) చేసిన పోరాటం గుర్తు చేసుకోవాలి.  ఆయన చేసిన పోరాట స్ఫూర్తితో  దేశవ్యాప్తంగా  పెన్షన్ హక్కును కాపాడుకునే ఉద్యమాలు మరింత ముమ్మరం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.

పెన్షన్లలో కోతలు 

1977 సంవత్సరానికి ముందు పదవీ విరమణ చేసినవారికి చాలా తక్కువగా వచ్చే పెన్షన్లలో వివిధ కారణాల పేరుతో కోతలు విధించేవారు. 1979లో  కేంద్ర ప్రభుత్వం లిబరలైజ్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకటించి 1979 నాటికి సర్వీస్​లో ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వులు ఇచ్చారు.  ఇది 1979కి ముందు రిటైరైన
వారికి శాపంగా మారింది.  ఆనాడు అత్యధికంగా రూ.675 మాత్రమే పెన్షన్ ఉండేది. ఆ పెన్షన్‌‌తో కుటుంబ జీవనం గడపడం కష్టతరమయ్యేది. కేంద్ర ప్రభుత్వ సరళీకృత పింఛన్ విధానం ద్వారా లభించే ఆర్థిక, ఇతర సౌలభ్యాలు 1979 మార్చి 31 నాటికి సర్వీసులో  ఉన్నవారికి వర్తిస్తాయని, అంతకు పూర్వం పదవీ విరమణ చేసినవారికి వర్తించవని 1979 మే 25న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఇవి  పెన్షన్‌‌దారులను కుంగదీసాయి.  అరకొర పెన్షన్‌‌తో  జీవించడం ఎలా అనే మానసిక  వేదనకు పెన్షన్‌‌దారులు గురయ్యారు.  స్వయంగా బాధితుడైన నకారా, మరికొంతమంది పెన్షన్ బాధితులతో  కలసి సుప్రీంకోర్టులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద  ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

పెన్షన్​ దయతో ఇచ్చే దానం కాదు

అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వై.వి చంద్రచూడ్‌‌తోపాటు ఐదుగురు న్యాయమూర్తులతో  కూడిన ధర్మాసనం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, వాటి పూర్వాపరాలను పరిశీలించి 1982 డిసెంబర్ 17న చారిత్రాత్మకమైన తీర్పును  వెలువరించినది. అందులో  ‘పింఛను అనేది యజమాని ఇష్టాయిష్టాలతో,  దయతో  ఇచ్చే దానం కాదు. అది పింఛనుదారుని హక్కు.  గతంలో ఉద్యోగిగా అతడు చేసిన సేవలను గుర్తించి చెల్లించేదే పింఛన్.  ఉద్యోగి పదవీ విరమణ అనంతరం వృద్ధాప్య జీవితం సుఖసంతోషాలతో,  గౌరవంతో సమాజంలో జీవించేందుకు చెల్లించేదిగా పింఛన్‌‌ను పరిగణించాలి.  పింఛన్‌‌దారుడు  స్వశక్తిపై ఆధారపడి జీవించడానికి కల్పించిన ఆర్థిక,  న్యాయపరంగా ప్రభుత్వం తీసుకోవలసిన చర్య పింఛన్.  కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు ఒక తేదీని ఎంచుకొని దానికి ముందుగాని, తరువాత గాని రిటైర్ అయినవారిని విభజించి చూడటాన్ని భారత రాజ్యాంగ ఆర్టికల్ 14కి విరుద్ధం.  నిర్ణీత తేదీకి ముందు రిటైర్ అయినవారికి కూడా, ఆ తేదీ తరువాత రిటైర్  అయినవారితో సమానంగా పెన్షన్ సవరణ లాభాలు ఇవ్వాలి.  పెన్షనర్స్ అందరినీ ఒక తరగతిగా పరిగణించి ఒకే ఫార్ములాతో  పెన్షనరీ ప్రయోజనాలు వర్తింపజేయాలి. పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదు’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.

డి.యస్  నకారా 1914  ఏప్రిల్ 8న ముంబైలో జన్మించి,  అలహాబాద్  డిగ్రీ  కళాశాలలో ఇంగ్లీష్  లిటరేచర్‌‌లో బంగారు పతకం అందుకున్నారు.  ఉర్దూ సాహిత్యంలో ఆయన చేసిన సేవలకు మాజీ రాష్ట్రపతి డాక్టర్  జాకీర్ హుస్సేన్ లాంటి ఉద్దండుల  ప్రశంసలు పొందారు.   సంగీత,  సాహిత్య, చిత్రకళా సంస్థలలో  కౌన్సిల్ సభ్యులుగా వ్యవహరించారు.  ఎన్నో సంస్థలకు ఆర్థిక సలహాదారుగా,  కేంద్ర ప్రభుత్వంలో,  ప్రభుత్వరంగ సంస్థలలో వివిధ పదవులు సమర్ధవంతంగా నిర్వహించారు.  1972లో  ఆర్థిక మంత్రిత్వశాఖలో అదనపు కార్యదర్శిగా,  రక్షణ శాఖకు ఆర్థిక సలహాదారుగా సేవలందిస్తూ పదవీ విరమణ చేశారు.  పెన్షన్‌‌దారుల కోసం  నకారా  చేసిన న్యాయపోరాటం ఆయనకు  విశేషమైన  గుర్తింపు తెచ్చింది.  పదవీ విరమణ తరువాత భారత సేవా సమాజం న్యూఢిల్లీ  పెన్షనర్స్  సర్వసభ్య  సమావేశంలో ఆయన  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  పెన్షన్ చెల్లింపులలో ప్రభుత్వాల వివక్షతను గమనించి న్యాయపోరాటం చేసి విజయం సాధించారు.  డిసెంబర్ 17వ తేదీన  చారిత్రకమైన తీర్పు వెలువడిన రోజు గుర్తుగా ‘పెన్షనర్స్ డే’ గా జరుపుకుంటూ పెన్షన్ హక్కులను కాపాడిన నకార కృషిని గుర్తు చేసుకుంటున్నారు. అన్ని రకాల పెన్షన్లకు ప్రమాదం ఏర్పడిన ప్రస్తుత తరుణంలో నకారా పోరాట స్ఫూర్తితో  రాజ్యాంగబద్ధమైన పెన్షన్ హక్కును కాపాడుకోవడమే  మనం అమరుడైన ఆయనకిచ్చే ఘన నివాళి.

- కె. వేణుగోపాల్, విద్యారంగ విశ్లేషకుడు