మనభూమి అద్భుతమైన జీవవైవిధ్యానికి నిలయం. కోట్లాది సంవత్సరాల పరిణామ క్రమంలో ఏర్పడిన అనేక జంతుజాలం ఈ భూమి మీద జీవిస్తున్నాయి. అయితే, పెరుగుతున్న మానవ ప్రకృతి వ్యతిరేక కార్యకలాపాల ద్వారా పర్యావరణ మార్పుల జీవి వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అనేక జంతువులు తమ మనుగడను కొనసాగించలేక అంతరించి కనుమరుగు అవుతున్నాయి.
వన్య ప్రాణుల నివాస స్థలాలైన అడవులను నరికి వేయడం వలన ఉష్ణోగ్రత పెరుగుదల తీవ్ర వ్యత్యాసాలు నమోదు అవుతున్నాయి. మరోవైపు దేశ ప్రధానరంగమైన వ్యవసాయ రంగంలో రసాయన ఎరువుల వాడకం వల్ల జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. ప్రకృతిపరమైన జీవవైవిధ్యం కోల్పోవడం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది.
దీంతోపాటు పరాగ సంపర్కం చేసే తేనెటీగలు, సీతాకోకచిలుకలు వంటి కీటకాలు లేకపోతే దాని ప్రభావం పంటల ఉత్పత్తిపై పడుతున్నది. అంతరించిపోతున్న జాతులను రక్షించుకోవాలంటే అడవుల నరికివేతను అరికట్టాలి. పర్యావరణ పునరుద్ధరణపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా సదస్సులను నిర్వహించాలి. జీవ వైవిధ్య ప్రాధాన్యతను ప్రజలకు తెలపాలి.
మానవ మనుగడను జీవ వైవిధ్యం ప్రభావితం చేస్తుందని ప్రజలకు తెలియజేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి. పర్యావరణ వ్యతిరేక కార్యక్రమాలను నియంత్రించేందుకు కఠినమైన చట్టాలు చేసి వాటిని సమర్థవంతంగా అమలు చేయాలి. అంతరించిపోతున్న జీవజాతులను పరిరక్షించడం మనందరి సామాజిక బాధ్యతగా గుర్తించాలి.
- సయ్యద్ షఫీ, హనుమకొండ
