ఖరీదైన బైక్లు చోరీ.. ముగ్గురు అరెస్ట్.. రూ.50 లక్షల విలువైన 17 వాహనాలు స్వాధీనం 

ఖరీదైన బైక్లు చోరీ.. ముగ్గురు అరెస్ట్.. రూ.50 లక్షల విలువైన 17 వాహనాలు స్వాధీనం 

గచ్చిబౌలి, వెలుగు: పార్కింగ్ చేసిన ఖరీదైన బైక్​లను చోరీ చేస్తున్న ముగ్గురిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్​ చేశారు. ఏపీలోని విశాఖకు చెందిన సంతోష్​దాస్​పదోతరగతి మధ్యలో ఆపేసి, జులాయిగా తిరిగేవాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడి, డబ్బుల కోసం ఖరీదైన బైక్​లను దొంగలించి, తక్కువ ధరకు తెలిసిన వ్యక్తులకు అమ్మేవాడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన బెజ్జంకి మణికంఠ, రాజమండ్రి లాలచెరువు ప్రాంతానికి చెందిన లోకేశ్​వర్మ నగరానికి వలస వచ్చి జెప్టో డెలివరీ బాయ్​గా చేస్తున్నారు. ఈ ముగ్గురూ కలిసి మియాపూర్​న్యూకాలనీలో ఉంటున్నారు. సంతోష్​దాస్ కు గతంలో బైక్​లు చోరీ చేసిన అనుభవనం ఉండటం.. అదే పని చేయాలనుకున్నారు. 

పార్కింగ్ ​ప్రదేశాలు, ఇండ్ల ఎదుట నిలిపిన ఖరీదైన ద్విచక్రవాహనాలను దొంగలించడం మొదలుపెట్టారు. వాటిని సంతోష్​దాస్​ తక్కువ ధరకు సొంతూరిలో తనకు తెలిసిన హేమంత్​, సాయిరాంలకు విక్రయిస్తున్నాడు. మంగళవారం కొత్తగూడ చౌరస్తా వద్ద  గచ్చిబౌలి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. 

ఆ సమయంలో బైక్​పై ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బైక్​లు చోరీ చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. దీంతో వారి వద్ద నుంచి  రూ.50 లక్షల విలువైన రాయల్​ ఎన్​ఫీల్డ్​, కేటీఎం డ్యూక్​, టీవీఎస్​ అపాచీ తదితర  17 వాహనాలను స్వాధీనం చేసుకొని, ముగ్గురినీ అరెస్ట్​ చేసినట్లు మాదాపూర్​ ఏసీపీ శ్రీధర్ తెలిపారు.