
- ఆగస్టు 1 న ఖైరతాబాద్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజక వర్గాల్లో...
- రోజూ 3 నియోజకవర్గాల్లో పంపిణీ
- పాల్గొననున్న మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్‌సిటీ, వెలుగు : నగరంలో నేటి నుంచి కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలుకాబోతుంది. శుక్రవారం ఖైరతాబాద్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజక వర్గాల్లో రవాణా శాఖ, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కార్డులు పంపిణీ చేస్తారని కలెక్టర్ హరి చందన ప్రకటించారు. మొదటి దశలో జిల్లాలో 55,378 మందికి కార్డులు ఇవ్వనున్నామని, వీటివల్ల 2,01,116 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. అదే విధంగా 1,37,947 పాత కార్డుల్లో అర్హులను చేర్చడంతో 2,32,297 మందికి మేలు కలగనుందన్నారు.
ఈ రోజు ఎక్కడెక్కడ అంటే ..
బంజారాహిల్స్‌లోని బంజారా భవన్ లో ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని వారికి ఉదయం 10 గంటలకు, కంటోన్మెంట్నియోజకవర్గంలోని వారికి మధ్యాహ్నం12 గంటలకు బాలంరాయిలోని జింఖానా గ్రౌండ్ ఎదురుగా ఉన్న ప్యాలెస్ లో, మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ నియోజక వర్గంలోని లబ్ధిదారులకు హబీబ్ ఫాతిమా నగర్ కమ్యూనిటీ హాల్ రహమత్ నగర్ లో కార్డులు పంపిణీ చేయనున్నారు.
అలాగే, శనివారం 10 గంటలకు అంబర్‌పేట, మధ్యాహ్నం 12 గంటలకు ముషీరాబాద్, 3 గంటలకు సికింద్రాబాద్ లో పంపిణీ కార్యక్రమం ఉంటుంది. 3వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు చార్మినార్, 12 గంటలకు కార్వాన్, 3 గంటలకు చంద్రాయణగుట్టలో కార్డులు అందజేస్తారు.