స్పిన్ రైజర్స్..స్పిన్ మ్యాజిక్‌తో ఫైనల్‌ చేరిన హైదరాబాద్

స్పిన్ రైజర్స్..స్పిన్ మ్యాజిక్‌తో ఫైనల్‌ చేరిన హైదరాబాద్

ఈ సీజన్‌‌లో పవర్ హిట్టింగ్‌‌తో..రికార్డు స్కోర్లతో  ప్రత్యర్థులను బెంబేలెత్తించిన సన్ రైజర్స్‌‌ హైదరాబాద్ తొలిసారి తమ  స్పిన్ బౌలింగ్ ప్రతాపాన్ని చూపెట్టింది. ఇన్నాళ్లూ ఓపెనర్‌‌‌‌గా పవర్‌‌‌‌ఫుల్ షాట్లతో ఇరగదీసిన అభిషేక్ శర్మ (2/24) ఈసారి బాల్‌తో మ్యాజిక్‌‌ చేశాడు.  మరో స్పిన్నర్ షాబాజ్ అహ్మద్‌‌  (3/23) కూడా చెలరేగడంతో చెపాక్ పిచ్‌‌పై రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ మైండ్‌‌బ్లాంక్‌‌  అయింది. సవాల్ విసిరిన వికెట్‌‌పై  క్లాసెన్‌‌ పోరాటం, రాహుల్ త్రిపాఠి మెరుపులతో చేసిన 175 స్కోరును అద్భుతంగా కాపాడుకున్న   హైదరాబాద్ ఆరేండ్ల గ్యాప్ తర్వాత ఫైనల్లోకి అడుగు పెట్టింది. రేపు ఇదే  గ్రౌండ్‌‌లో  కోల్‌‌కతా నైట్ రైడర్స్‌‌తో ఆఖరి సవాల్‌‌కు రెడీ అయింది.

చెన్నై : ఐపీఎల్‌‌లో రెండోసారి విజేతగా నిలిచేందుకు సన్  రైజర్స్ హైదరాబాద్ మరొక్క అడుగు దూరంలో నిలిచింది. మెగా లీగ్‌‌లో హైదరాబాద్‌‌ మూడోసారి ఫైనల్‌‌కు దూసుకెళ్లింది. క్వాలిఫయర్‌‌‌‌1లో తడబడినా రెండో ప్రయత్నంలో మాత్రం ఆల్‌‌రౌండ్ పెర్ఫామెన్స్‌‌తో అదరగొట్టింది. చెపాక్ స్టేడియంలో  శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫయర్‌‌లో  36   రన్స్ తేడాతో  రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ను చిత్తుచేసింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో తొలుత సన్ రైజర్స్ 20 ఓవర్లలో 175/9 స్కోరు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (34 బాల్స్‌‌లో 4 సిక్సర్లతో 50) ఫిఫ్టీ కొట్టగా, రాహుల్ త్రిపాఠి (15 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 37)

ట్రావిస్ హెడ్ (28 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 34) రాణించాడు. రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా..  సందీప్ శర్మ రెండు వికెట్లు తీశాడు. ఛేజింగ్‌‌లో రాజస్తాన్‌‌ ఓవర్లన్నీ ఆడి 139/7  స్కోరు మాత్రమే చేసి ఓడింది. ధ్రువ్ జురెల్ (35 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 నాటౌట్) యశస్వి జైస్వాల్ (21 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 42) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. షాబాజ్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఆదుకున్నక్లాసెన్

టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన సన్ రైజర్స్‌‌ క్లాసెన్‌‌ పోరాటంతో 170 ప్లస్ స్కోరు చేసింది. గత రెండు మ్యాచ్‌‌ల్లో డకౌటైన హెడ్ ఈసారి కాసేపు నిలబడ్డా..  మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (12)మళ్లీ నిరాశ పరిచాడు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్లో  6, 4తో అలరించిన అతను  ఆరో బాల్‌‌కు  కోహ్లెర్‌‌‌‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కానీ, వన్ డౌన్‌‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి స్పిన్నర్ అశ్విన్ వేసిన నాలుగో ఓవర్లో 4, 4, 6తో ఆకట్టుకున్నాడు. బౌల్ట్‌‌ వేసిన తర్వాతి ఓవర్లోనూ 6, 4 బాదాడు. కానీ, స్లో బౌన్సర్‌‌‌‌తో త్రిపాఠిని ఔట్‌‌ చేసిన బౌల్ట్‌‌ రెండు బాల్స్‌‌ తర్వాత మార్‌‌‌‌క్రమ్ (1)ను కూడా వెనక్కుపంపడంతో రైజర్స్ 57/3తో డీలా పడింది. తొలి తొమ్మిది బాల్స్‌‌లో ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయిన హెడ్..

సందీప్ వేసిన ఆరో ఓవర్లో రెండు ఫోర్లు రాబట్టడంతో పవర్ ప్లేను రైజర్స్‌‌ 68/3తో ముగించింది. అవేశ్‌‌ బౌలింగ్‌‌లో హెడ్ 6, 4తో ఊపందుకోగా.. స్పిన్నర్ చహల్‌‌ను టార్గెట్‌‌ చేసిన క్లాసెన్ భారీ సిక్స్ కొట్టడంతో హైదరాబాద్ పుంజుకుంది.  కానీ, ఈ టైమ్‌‌లో రాజస్తాన్ బౌలర్లు మళ్లీ జోరు పెంచారు. వరుసగా నాలుగు ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో సందీప్ స్లో బౌన్సర్‌‌‌‌కు హెడ్‌‌ .. అశ్విన్‌‌కు చిక్కాడు. చహల్ వేసిన 13వ ఓవర్లో క్లాసెన్ సిక్స్‌‌తో మళ్లీ వేగం పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, తర్వాతి ఓవర్లో  అవేశ్‌‌ ఖాన్ వరుస బాల్స్‌‌లో నితీశ్‌‌ కుమార్ (5), అబ్దుల్ సమద్ (0)ను ఔట్‌‌ చేసి రైజర్స్‌‌కు డబుల్ షాకిచ్చాడు.  స్లాగ్ ఓవర్లలోనూ రాయల్స్ బౌలర్లు కట్టు తప్పలేదు.

చహల్ బౌలింగ్‌‌లో క్లాసెన్ మరో సిక్స్ కొట్టినా.. 16వ  ఓవర్లో అవేశ్‌‌ నాలుగే రన్స్ ఇవ్వడంతో రైజర్స్‌‌ 136/6తో నిలిచింది.  ఇంపాక్ట్ ప్లేయర్‌‌‌‌గా వచ్చిన షాబాజ్ అహ్మద్ (18) అశ్విన్  ఓవర్లో సిక్స్ సహా 14 రన్స్ రాబట్టి స్కోరు 150 దాటించగా..  బౌల్ట్ బౌలింగ్‌‌లో సిక్స్‌‌ రాబట్టిన క్లాసెన్ 33 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 19వ ఓవర్లో తొలి బాల్‌‌కే అద్భుతమైన స్లో యార్కర్‌‌‌‌తో క్లాసెన్‌‌ను క్లీన్ బౌల్డ్ చేసిన సందీప్,  చివరి ఓవర్లో షాబాజ్ వికెట్‌‌ తీసిన అవేశ్‌‌ కూడా ఆరేసి రన్స్‌‌ మాత్రమే ఇవ్వడంతో  రైజర్స్ భారీ స్కోరు చేయలేకపోయింది. 

అభిషేక్‌‌ సర్‌‌ ప్రైజ్‌, షాబాజ్ అదుర్స్

ఛేజింగ్‌‌లో రాజస్తాన్‌‌ను  నిలువరించడంలో సన్‌‌ రైజర్స్‌‌ బౌలర్లు సక్సెస్ అయ్యారు. ఆరంభం నుంచే  కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫీల్డర్లు కూడా అదరగొట్టారు. క్రీజులో ఇబ్బంది పడ్డ  రాయల్స్‌‌ ఓపెనర్ కోహ్లెర్ (16 బాల్స్‌‌లో 10)ను నాలుగో ఓవర్లో  ఔట్‌‌ చేసిన కమిన్స్‌‌ హైదరాబాద్‌‌కు తొలి బ్రేక్ అందించాడు. కానీ, మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడు చూపెట్టాడు. భువీ వేసిన ఆరో ఓవర్లో సిక్స్, మూడు ఫోర్లతో రెచ్చిపోవడంతో పవర్ ప్లేను ఆర్‌‌‌‌ఆర్ 51/1తో ముగించింది. వన్ డౌన్‌‌లో వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్  (10) నింపాదిగా బ్యాటింగ్ చేశాడు.

కానీ, పవర్ ప్లే తర్వాత స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్‌‌, అభిషేక్  అద్భుతంగా బౌలింగ్‌‌ చేశారు.  షాబాజ్ వేసిన ఏడో ఓవర్లో రివర్స్ స్వీప్‌‌తో సిక్స్ కొట్టిన జైస్వాల్ మరో షాట్‌‌కు ట్రై చేసి సమద్‌‌కు క్యాచ్ ఇచ్చాడు. ఈ టైమ్‌లో అనూహ్యంగా  బౌలింగ్‌కు వచ్చి పూర్తి కోటా వేసిన అభిషేక్ తన స్పిన్‌తో అందరినీ సర్‌‌ ప్రైజ్‌ చేశాడు. తన మూడో బాల్‌‌కే శాంసన్‌‌ను ఔట్‌‌ చేసి రాజస్తాన్‌‌ను దెబ్బకొట్టాడు. వరుసగా మూడు ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా రాకపోవడంతో రాజస్తాన్‌‌పై ఒత్తిడి పెరిగింది. షాబాజ్ బౌలింగ్‌‌లో భారీ షాట్‌‌కు ప్రయత్నించిన రియాన్ పరాగ్‌‌ (6) అభిషేక్‌‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగ్గా..

అదే ఓవర్లో  అశ్విన్ (0) కీపర్‌‌‌‌కు చిక్కడంతో రాజస్తాన్‌‌ 79 రన్స్‌‌కే సగం వికెట్లు కోల్పోయి డీలా పడింది. ఓ ఎండ్‌‌లో ధ్రువ్ జురెల్ పోరాడినా అతనికి సపోర్ట్ కరువైంది.  ఇంపాక్ట్ ప్లేయర్‌‌‌‌గా వచ్చిన హెట్‌‌మయర్ (4) ఏ మాత్రం  ఇంపాక్ట్ చూపెట్టలేకపోయాడు. పది బాల్స్‌‌లో ఒక్క బౌండ్రీ కూడా కొట్టని అతను అభిషేక్ బౌలింగ్‌‌లో క్లీన్ బౌల్డ్‌‌ అయ్యాడు. ఈ టైమ్‌‌లో జురెల్ వెంటవెంటనే నాలుగు ఫోర్లు కొట్టి జట్టును రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. కమిన్స్ వేసిన 17వ ఓవర్లో ఓ సిక్స్‌‌తో ఆశలు రేపాడు. అయితే,  చివరి 18 బాల్స్‌‌లో రాయల్స్‌‌కు 53 రన్స్ అవసరం అవగా.. 18వ ఓవర్లో పావెల్ (6) వికెట్ తీసిన నటరాజన్  రైజర్స్ విజయం ఖాయం చేశాడు.

 సన్‌ రైజర్స్ ఫైనల్ చేరడం ఇది మూడోసారి. 2016లో ఆర్‌‌సీబీపై గెలిచి  టైటిల్ నెగ్గిన జట్టు 2018లో చెన్నై చేతిలో ఓడింది.

 సంక్షిప్త స్కోర్లు

హైదరాబాద్‌ ‌: 20 ఓవర్లలో 175/9  (క్లాసెన్ 50, త్రిపాఠి 37, అవేశ్‌‌ 3/27 , బౌల్ట్ 3/45)
రాజస్తాన్‌ ‌:  20 ఓవర్లలో 139/7 (జురెల్ 56*, షాబాజ్ 3/23, అభిషేక్  2/24)