ఫిట్​నెస్​ లేకుండా దొరికితే సీజ్ చేసుడే.. మే 15 వరకు విద్యాసంస్థలకు ఆర్టీఏ గడువు

ఫిట్​నెస్​ లేకుండా దొరికితే సీజ్ చేసుడే.. మే 15 వరకు విద్యాసంస్థలకు ఆర్టీఏ గడువు
  • 16 నుంచి కాలం చెల్లిన, ఫిట్​నెస్​లేని వెహికల్స్ పై కొరఢా 
  • గ్రేటర్​లో విద్యా సంస్థలకు చెందిన 30 వేల బస్సులు
  •  2,500 వాహనాలు కాలపరిమితి తీరినవే

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​ పరిధిలో విద్యాసంస్థల వాహనాలు ఈ నెల 15వ తేదీలోపు ఫిట్​నెస్​పరీక్షలు చేయించుకోవాల్సిందేనని ఆర్టీఏ అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే  కొందరు వాహనదారులకు నోటీసులు పంపామని, నిర్ణయించిన గడువు లోపు ఫిట్​నెస్​ పరీక్షలు చేయించుకోకపోతే తనిఖీలు చేసి సీజ్​చేస్తామని హెచ్చరించారు. ఏడాదికోసారి విద్యాసంస్థల వాహనాలకు  ఫిట్​నెస్​ టెస్టులు చేయాల్సి ఉన్నా, మేనేజ్​మెంట్లు పట్టించుకోవడం లేదు. ఫిట్​నెస్​ లేని వాహనాల్లోనే విద్యార్థులను చేరవేస్తూ ప్రమాదాలతో ఆటలాడుతున్నారు. దీంతో ఈసారి అన్ని బస్సులకు ఫిట్​నెస్​పరీక్షలు చేయించాల్సిందేనని ఆర్టీఏ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.  

ఫిట్​నెస్​ఉన్నవి 50 శాతమే..

గ్రేటర్​ పరిధిలో స్కూళ్లు, కాలేజీలకు సంబంధించి సుమారు 30 వేల బస్సులు, ఇతర వాహనాలున్నాయి.  వీటిలో 50 శాతం మాత్రమే ఫిట్ నెస్ టెస్ట్​లు చేయించుకుంటున్నారని, మిగిలిన 15 వేలల్లో దాదాపు 2,500 వాహనాలు 15 ఏండ్లు పూర్తి చేసుకున్నవి ఉన్నాయని అధికారులు గుర్తించారు. వీటిని మేనేజ్​మెంట్లు దర్జాగా రోడ్ల మీద నడిపిస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. ఇక నుంచి ఫిట్​నెస్​ లేని, కాలం చెల్లిన వాహనాలకు చెక్​పెట్టబోతున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆర్టీఏ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే ఫిట్​నెస్​సర్టిఫికెట్లు జారీ చేస్తామని అధికారులు అంటున్నారు.

ఫిట్​నెస్​కు ప్రమాణాలివి...

స్కూళ్లు, కాలేజీల వాహనాలకు ఫిట్​నెస్​సర్టిఫికెట్​ఇవ్వాలంటే కొన్ని ప్రమాణాలు తప్పని సరిగా పాటించాలి. ఆయా బస్సుల్లో, వాహనాల్లో స్టూడెంట్స్​సులభంగా ఎక్కి దిగడానికి మెట్లు ఉండాలి. వాహనాల కిటికీల నుంచి చేతులు, తలబయటకు పెట్టకుండా జాలీలు ఏర్పాటు చేయాలి. బస్సులో అగ్ని మాపక పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పనిసరిగా ఉండాలి. ఇన్సూరెన్స్​చేయించి, ఆర్టీఏకు పన్ను చెల్లించి ఉండాలి. బస్సు నడిపే డ్రైవర్ 60 ఏండ్లలోపు వారై ఉండాలన్న నిబంధనలు ఉన్నాయి. 

ఇవేమీ పాటించని వాహనాలను సీజ్​ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే, వాహనాల తనిఖీల్లో అనేక లోపాలు బయటపడుతున్నా అధికారులు కేవలం జరిమానాలు వేసి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్టీఏ ప్రమాణాలు పాటించని బస్సులను స్క్రాప్(తుక్కు)గానే పరిగణించాలి. కానీ, కొందరు ఆర్టీఏ సిబ్బంది స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాల నుంచి లంచాలు తీసుకొని చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.