ISSF‌‌‌ వరల్డ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో హైదరాబాద్ షూటర్ ఇషాకు మరో మెడల్

ISSF‌‌‌ వరల్డ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో హైదరాబాద్ షూటర్ ఇషాకు మరో మెడల్

కైరో: ప్రతిష్టాత్మక ఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ వరల్డ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో హైదరాబాద్ స్టార్ షూటర్ ఇషా సింగ్ అదరగొడుతోంది. మెగా టోర్నీలో మరో సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. 10 మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌‌‌‌డ్ టీమ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో సామ్రాట్ రాణాతో కలిసి ఈ పతకం నెగ్గింది. మంగళవారం జరిగిన గోల్డ్ మెడల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఇషా, సామ్రాట్ 10–16తో చైనా షూటర్లు యవో క్వింకమ్‌‌‌‌– హు కై చేతిలో ఓడిపోయారు.

10 మీ. ఎయిర్ పిస్టల్‌‌‌‌ వ్యక్తిగత స్వర్ణంతో వరల్డ్ చాంపియన్‌‌‌‌గా నిలిచిన సామ్రాట్‌‌‌‌, విమెన్స్‌‌‌‌ టీమ్ ఈవెంట్‌‌‌‌లో సిల్వర్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన ఇషా క్వాలిఫికేషన్‌‌‌‌ రౌండ్‌‌‌‌లో 586 స్కోరుతో టాప్ ప్లేస్‌‌‌‌లో నిలిచి నేరుగా గోల్డ్ మెడల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు క్వాలిఫై అయ్యారు. తుది పోరులో ఈ ఇద్దరూ  చెరో 10.4 పాయింట్లతో తొలి సిరీస్‌‌‌‌ నెగ్గి గోల్డ్‌‌పై ఆశలు రేపారు. 

కానీ, అదే జోరు కొనసాగించలేక వరుసగా నాలుగు సిరీస్‌‌‌‌లు కోల్పోయి 2–6తో వెనుకంజ వేశారు. మధ్యలో పుంజుకొని ఎనిమిదో సిరీస్‌‌‌‌ తర్వాత 9–7తో ఆధిక్యంలోకి వచ్చినా దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. చివరి దశలో ఒత్తిడిని తట్టుకోలేక సిల్వర్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టారు.  

మరోవైపు మెన్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌‌‌‌లో ఐశ్వరి ప్రతాప్ సింగ్‌‌‌‌ తోమర్ రజతం అందుకున్నాడు. ఫైనల్లో ప్రతాప్ సింగ్ 466.9 స్కోరుతో రెండో స్థానంలో నిలిచాడు. చైనాకు చెందిన యుకున్ లియు 467.1తో గోల్డ్ నెగ్గగా.. ఫ్రాన్స్‌‌‌‌ షూటర్ రొమైన్ ఆఫ్రెరె (454.8) బ్రాంజ్ సొంతం చేసుకున్నాడు. మరో ఇండియన్ నీరజ్ కుమార్ (432.2) ఐదో ప్లేస్‌‌‌‌తో సరిపెట్టాడు.