- కొరియా, జపాన్‌లాగా ‘సాఫ్ట్ పవర్’ గా ఎదగాలి: చిరంజీవి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ గ్లోబల్ హబ్ గా మారాలని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. హైదరాబాద్ ను భారతీయ సినిమా హబ్‌గానే కాకుండా.. ప్రపంచ సినీ హబ్‌గా మార్చాలన్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం అద్భుతమని కొనియాడారు. రేవంత్ విజన్‌ను సాకారం చేయడానికి చిత్ర పరిశ్రమ తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.
కొరియా, జపాన్ దేశాలు వినోద రంగాన్ని ‘సాఫ్ట్ పవర్’గా మార్చుకుని ఆర్థికంగా ఎలా బలపడ్డాయో.. మనం కూడా ఆ దిశగా ఎదగాలని ఆకాంక్షించారు. మంగళవారం జరిగిన 'తెలంగాణ రైజింగ్ విజన్-2047' డాక్యుమెంట్ ఆవిష్కరణలో చిరంజీవి మాట్లాడారు. ‘‘ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో రేవంత్‌ను కలిసినప్పుడు హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా మారుస్తానని చెప్పారు.
గత ప్రభుత్వాల అనుభవాల దృష్ట్యా ఇది సాధ్యమేనా అని నాకు సందేహం కలిగింది. కానీ, చాలా తక్కువ సమయంలోనే ప్రపంచ స్థాయి సెక్టార్లను ఆహ్వానిస్తూ నేడు సినిమాలను కూడా ఇందులో అంతర్భాగం చేయడం చూస్తుంటే రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి అర్థమవుతోంది. ఆయన అనుకున్నది కచ్చితంగా సాధిస్తారనే నమ్మకం కలిగింది” అని చిరంజీవి చెప్పారు.
స్టూడియోలు, స్థలాలే కాకుండా.. పరిశ్రమకు అవసరమైన మానవ వనరులను తయారు చేసుకోవాలని ఆయన సూచించారు. అన్ని విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చే ఇన్‌స్టిట్యూట్‌లను ఏర్పాటు చేయాలన్నారు. డిగ్రీలు లేకపోయినా నైపుణ్యంతో గొప్ప డైరెక్టర్లు అయిన వారు మన దగ్గర ఉన్నారని తెలిపారు.
ఇప్పటికే సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి బాలీవుడ్ ప్రముఖులు హైదరాబాద్‌లో ఫ్యూచరిస్టిక్ స్టూడియోలు నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నారని, ఇది శుభపరిణామమని పేర్కొన్నారు. ‘‘మన దగ్గర అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి. వసతులు కల్పిస్తే ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుంది. పరిశ్రమ పెద్దలతో సెమినార్ నిర్వహించి, ఈ విజన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తాం” అని చిరంజీవి అన్నారు.

