పెండ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి.. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగికి 20 ఏండ్ల జైలు

పెండ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి.. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగికి 20 ఏండ్ల జైలు

బషీర్​బాగ్, వెలుగు: పెండ్లి చేసుకుంటానని నమ్మించి, ఓ యువతిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి జైలు శిక్ష పడింది. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ వివరాల ప్రకారం.. హైటెక్ సిటీలో సాఫ్ట్​వేర్ జాబ్ చేస్తున్న స్వాగత్ కుమార్ భోయ్ (42) తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాధిత మహిళ 2017లో గచ్చిబౌలి పీఎస్ లో ఫిర్యాదు చేసింది. 

2009 నుంచి మాయమాటలు చెప్పి తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. తనకు తెలియకుండా 2017లో ఒడిశాలో మరో మహిళను వివాహం చేసుకున్నాడని... అతన్ని నిలదీస్తే తనకు రాజకీయ పలుకుబడి ఉందని బెదిరించారని తెలిపింది.

 దీంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఆధారాలను పరిశీలించిన అనంతరం రంగారెడ్డి జిల్లా కోర్టు నిందితుడికి 20 ఏండ్ల కఠిన జైలు శిక్షతో పాటు రూ.5,100 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. బాధితురాలికి రూ.2 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.