వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు చిన్న వయసు వారి కూడా బలితీసుకుంటుంది. కార్డియాక్ అరెస్ట్ తో అకస్మాత్తుగా చనిపోయి వారి కుటుంబంలో విషాదాన్ని మిగిల్చి వెళ్తున్నారు. మాస్టర్స్ చేయడానికి కెనడా వెళ్లిన 25ఏళ్ల హైదరాబాద్ విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. 2022 డిసెంబర్ 22న షేక్ ముజమ్మిల్ అహ్మద్ కిచెనర్ సిటీలో వాటర్‌లూ క్యాంపస్‌లోని కొనెస్టోగా కాలేజీలో మాస్టర్స్ చదవడానికి వెళ్లాడు. గత వారం రోజులుగా అహ్మద్ జ్వరంతో బాధపడుతున్నాడు. గురువారం అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందాడు. ఉన్నత చదవుకై వెళ్లిన అహ్మద్ మరణ వార్త కుటుంబ సభ్యుల హృదయాల్లో విషాదాన్ని నింపింది.
ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్ హైదరాబాద్ లోని అహ్మద్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. ఈ వార్త విన్న తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. కెనడాకు వెళ్లక ముందు అహ్మద్ తన ఫ్యామిలీతో హైదరాబాద్‌లోని టోలీచౌకిలోని బాల్‌రెడ్డి నగర్ కాలనీలో ఉండేవాడు. అహ్మద్ అంత్యక్రియల కోసం మృతదేహాన్ని ఇండియాకు చేర్చాలని అతని బంధువులు గురువారం విదేశాంగ మంత్రి జై శంకర్ ను కోరారు. దీంతో వెంటనే మంత్రి కెనడాలోని భారతీయ రాయబారి కార్యాలయంతో మాట్లాడి మృతదేహాన్ని ఇండియాకు రప్పించే ఏర్పాటు చేశారు. అహ్మద్ డెడ్ బాడీ కోసం బంధువులు ఎదురుచూస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే తమ కొడుకు చనిపోయాడన్న వార్తను తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.
