
- గిఫ్టులు, ఫ్రేమ్ లు, గాజుల మధ్యలో ప్యాక్ చేస్తూ స్మగ్లింగ్
- మేడ్చల్ జిల్లా నాచారంలో చిక్కిన చెన్నై గ్యాంగ్ నుంచి రూ.9 కోట్ల విలువైన 8.5 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్ స్వాధీనం
- ఇద్దరు అరెస్ట్, పరారీలో ముగ్గురు నిందితులు
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ రవాణాకు హైదరాబాద్ అడ్డాగా మారుతోంది. ఇంతకాలం ఇతర దేశాల నుంచి రాష్ట్రానికి స్మగ్లింగ్ అయ్యే డ్రగ్స్ ఇప్పుడు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఫారిన్ పార్సిల్స్‌ను డ్రగ్ స్మగ్లర్స్ తమకు అనుకూలంగా మలుచుకున్నారు. రాష్ట్ర పోలీసులు, కస్టమ్స్, డీఆర్‌ఐ అధికారులకు చిక్కకుండా డ్రగ్స్ ఎగుమతి చేస్తున్నారు. ఏటా రూ. వందల కోట్ల విలువ చేసే డ్రగ్స్, ముడిసరుకును దేశాలు దాటిస్తున్నారు.
షిప్ యార్డ్, ఇంటర్నేషనల్ కార్గో ఎయిర్‌లైన్స్‌లో సౌత్ ఆఫ్రికా, అమెరికా, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్‌లాంటి దేశాలకు పంపిస్తున్నారు. స్కానర్లకు చిక్కకుండా ఎలక్ట్రానిక్ వస్తువులు, గిఫ్ట్ ఆర్టికల్స్, ఫ్రూట్స్, ఫొటో ఫ్రేమ్స్, గాజులతో పాటు ప్యాకింగ్ చేసి పార్సిల్ చేస్తున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ తరహాలోనే సినీ ఫక్కీలో రవాణా చేస్తున్నారు.
కోడ్ భాషలో..
ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కొరియర్స్ సర్వీసెస్‌కి పార్సిల్స్ వస్తున్నాయి. వాటిపై రిసీవర్స్‌కి సంబంధించిన వివరాలు ఉండడం లేదు. డెలివరీ కొరియర్ సర్వీసెస్ ఆధారంగా కార్గో ఫ్లైట్స్‌లో పంపుతున్నారు.ఫ్లైట్ వివరాలను ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి యాప్స్‌తో కోడ్ భాషలో షేర్ చేస్తున్నారు. మల్కాజిగిరిలో ఇలాంటి డ్రగ్స్ సెంటర్ ఏర్పాటు చేసిన గ్యాంగ్‌ను సోమవారం రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
రూ.9 కోట్లు విలువ చేసే 8.5 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్, రూ. 4.02 లక్షల క్యాష్, 23 రామ్‌రాజ్ కవర్ బాక్సెస్, 5 పాస్‌పోర్టులు, 3 ఆధార్ కార్డులు స్వా ధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్ మీ దుగా ఆస్ట్రేలియాకు పంపిస్తున్న డ్రగ్స్ వివరాలను రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ సోమవారం వెల్లడించారు. ఐదుగురు సభ్యుల ముఠాలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు చెప్పారు.
స్మగుల్ గూడ్స్ నుంచి డ్రగ్స్ స్మగ్లర్స్‌గా
తమిళనాడు శివగంగ జిల్లాకు చెందిన మహ్మద్ కాసీమ్(31) ఎంబీఏ చదివాడు. రసూలుద్దీన్(39)తో కలిసి మలేషియా తదితర దేశాలకు వెళ్లి ఎలక్ట్రానిక్ గూడ్స్(స్మగుల్ గూడ్స్) తక్కువ ధరకు తెచ్చి దేశ వ్యాప్తంగా అమ్ముతున్నాడు. 2013లో రసూలుద్దీన్‌కు అతని స్నేహితుడు ఇబ్రహీం పరిచయం అయ్యాడు. డ్రగ్స్ దాచిన సూట్‌కేసును మలేషియాకు తీసుకెళ్తే రూ.లక్ష ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నాడు. ఎక్స్‌పోర్ట్ కోసం స్థానికుల ఆధార్, పాన్‌కార్డ్‌లతో ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారు.
ఇలా డ్రగ్స్‌ను మలేషియాకు స్మగ్లింగ్ చేస్తూ మధురై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. 3నెలలు జైల్లో ఉన్నాడు. ఫరీద్, ఫైజల్‌ను కూ డా డ్రగ్ స్మగ్లింగ్‌లోకి దింపాడు. వీళ్లంతా ఇతర దేశాలు తిరుగుతూ స్మగుల్ గూడ్స్ తెచ్చి అమ్మేవారు. విదేశాల్లో డ్రగ్స్‌కు డిమాండ్ ఉండడంతో ముడిసరుకును ఎక్స్‌పోర్ట్ చేసేందుకు ప్లాన్ చేశారు.
గాజులు, గిఫ్ట్ ప్యాక్స్ మధ్యలో పౌడర్
చెన్నైలో ఎఫిడ్రిన్ సింథటిక్ డ్రగ్‌ను తయారు చేసి బట్టలు, గాజులు, పిల్లల గిఫ్ట్ లతో ప్యాక్ చేసేవారు. డ్రగ్ పౌడర్ కోసం ప్రత్యేకంగా ఒక పొరను తయా రు చేశారు. అందులో ప్లాస్టిక్ కవర్లలో 80 నుంచి 100 గ్రాములు డ్రగ్ నింపుతున్నారు. వాటిని ప్యాకెట్ల కవర్లలో దాచిపెట్టి ఎవరూ గుర్తుపట్టని విధం గా తయారు చేస్తారు. ఇలా బాక్సుల్లో నింపిన వాటిని హైదరాబాద్‌లోని జీవీఆర్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీసెస్, పుణేలోని ఇండోఫైన్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ద్వారా విదేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు.
గోల్డ్ స్మగ్లింగ్ తరహాలోనే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు ఎయిర్‌పోర్ట్‌ల ద్వారా రవాణా చేస్తున్నారు. ఇలా ఈ ఏడాది ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి 8సార్లు, పుణే నుంచి 7 సార్లు మొత్తం 70 కిలోల సూడో ఎఫిడ్రిన్‌ను ఎక్స్‌పోర్ట్ చేశారు.
బ్రాండెడ్ బట్టల్లో ప్యాకింగ్.. బస్సుల్లో తరలింపు
నాలుగు రోజుల కింద చెన్నైలో రహీమ్ అనే వ్యక్తి ద్వారా కాసీమ్, రసూలుద్దీన్ సింథటిక్ డ్రగ్‌ను సేకరించారు. రామ్‌రాజ్ కాటన్‌తో పాటు వివిధ బ్రాండెడ్ కంపెనీలకు చెందిన బాక్సుల్లో బట్టలు, లుంగీలు, పంచెలు, షర్ట్ లతో ప్యాక్ చేసి బస్సుల్లో హైదరాబాద్ తరలించారు. ఆదివారం రాత్రి నాచారంలోని ఒక లాడ్జిలో దిగారు. లాడ్జి గదిలో తమతో తెచ్చుకున్న రామ్ రాజ్ కాటన్ బట్టల ప్యాకెట్లకు పైనా, కింద ఒక పొరను తొలగించారు. అందులో డ్రగ్స్ నింపారు. ఇలా ప్యాక్ చేసిన బాక్స్‌లను సాధా రణ బట్టల బాక్స్ ల్లా మార్చారు. ఇలా 23 బాక్సు ల్లో 4.6 కిలోల డ్రగ్స్ ప్యాక్ చేశారు. వాటిని 3ప్లాస్టి క్ కవర్లలో పెట్టి ఈసీఐఎల్‌లోని ఇంటర్నేషనల్ కొరి యర్ సర్వీసెస్ ద్వారా పంపించేందుకు ట్రై చేశారు.
పోలీస్ నిఘాతో దొరికిపోయారు
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా రాచకొండ పోలీసులు డ్రగ్స్ ముఠాలపై పెట్టిన నిఘా వల్ల ఈ ఎగుమతి దందా బయటపడింది. లాడ్జిలో డ్రగ్స్ ప్యాకింగ్ సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు రెయిడ్స్ చేశారు. స్పాట్‌లో కాసీమ్, రసూలుద్దీన్ లను అరెస్ట్ చేశారు. ఫరీద్, ఫైజల్, రహీమ్ పరారీలో ఉన్నారు. డ్రగ్స్ ఎక్కడ తయారు చేస్తున్నారు? దీని వెనుక ఎవరున్నారు? అనే విషయాలపై రాచకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటినుంచి ఇంటర్నేషనల్ పార్సిల్స్‌పై మరింత ఫోకస్ పెడతామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. డిసెంబర్ 31 వరకు స్పెషల్ ఆపరేషన్స్ చేపడతామని వెల్లడించారు.