హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి సంబురాలను వినూత్నంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 11 నుంచి 13 వరకు మూడ్రోజుల పాటు చెరువుల చెంత కైట్ ఫెస్టివల్ నిర్వహించనుంది. దీనికి సినీ, ఐటీ, క్రీడా ప్రముఖులను ఆహ్వానించనుంది. ఈ మేరకు పర్యాటక శాఖ, హైడ్రా సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
గురువారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైడ్రా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరుగుతున్న చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనుల పురోగతిని సీఎంకు వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. చెరువుల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేలా, సంక్రాంతి పండుగ శోభ ఉట్టిపడేలా చెరువుల వద్దే గాలిపటాల పండుగ నిర్వహించాలని సూచించారు.
