ఇకపై అనధికారికంగా సైరన్లు వాడితే బండి సీజ్ చేసుడే.. గ్రేటర్ లో స్పెషల్ డ్రైవ్ స్టార్ట్

ఇకపై అనధికారికంగా సైరన్లు వాడితే బండి సీజ్ చేసుడే.. గ్రేటర్ లో స్పెషల్ డ్రైవ్ స్టార్ట్

అనధికారికంగా సైరన్లను వినియోగిస్తున్న వారిపై హైదరాబాద్ పోలీసులు చర్యలు ఇకపై తీసుకోనున్నారు. రూల్స్ బ్రేక్ చేసిన వారిపై కేసులు నమోదు చేయనున్నారు. కొంతమంది అనధికారికంగా తమ వాహనాలకు సైరన్లు వినియోగిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ .. చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి.. అనధికారికంగా సైరన్లు ఉన్న వాహనాలను సీజ్ చేయాలని కోరారు. 

ఎమర్జన్సీ సమయాల్లో ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా పోలీసుల వాహనాలకు, అంబులెన్స్‌లకు మాత్రమే సైరన్లు ఉంటాయి. ట్రాఫిక్‌లో సైరన్లు వీరు తప్ప మిగతా వాహనాల్లో వినియోగించటం చట్టవిరుద్దం. అయితే.. కొంతమంది మాత్రం అధికారదర్పంతో అనధికారికంగా సైరన్లు వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ నుంచి బయటపడేందుకు ప్రైవేటు వాహనాలకు కూడా సైరన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. సైరన్లు ఎవరు పడితే వారు వినియోగించవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ... అవేవి పట్టించుకోవడం లేదు. తమ ప్రైవేటు వాహనాలకు సైరన్లను ఏర్పాటు చేసుకుని.. మిగతా ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.

ట్రాఫిక్ లో చిక్కుకొని ఇబ్బంది పడే వాహనదారులకు ఈ సైరన్ల గోల తలనొప్పి తెప్పిస్తున్నాయి.  టోలిచౌకిలో రాత్రి పదిన్నర సమయంలో ఏపీ రిజిస్ట్రేషన్ ఉన్న ఇన్నోవా వాహనం సైరన్ తో హల్ చల్ చేసింది. దీన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేశారు. దీనిపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. చట్టవిరుద్ధంగా సైరన్ లను ఉపయోగించే వారిపై చర్యలు తీసుకోవాలని, వాహనాలను సీజ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. 
 
‘ఇలా చట్టవిరుద్ధంగా సైరన్‌లను ఉపయోగించడం వల్ల చాలా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అనధికార సైరన్లు వాడే అన్ని వాహనాలను సీజ్ చేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను కోరాను. రోగులు లేకపోయినా.. కొన్ని అంబులెన్సుల్లో సైరన్లు మోగిస్తున్నారు. అలా సైరన్లు మోగించే అంబులెన్స్‌లపై చర్యలు తీసుకుంటాం. చట్టవిరుద్ధమైన సైరన్‌లను ఉపయోగించే వాహనాలకు సంబంధించిన రుజువులతో ప్రజలు సమాచారం ఇస్తుండాలి’ అని సీవీ ఆనంద్ ట్వీట్ చేశారు.

https://twitter.com/krishna0302/status/1650189828992925696