ఆసీస్, సౌతాఫ్రికాతో సిరీస్‌ల షెడ్యూల్‌ను ఖరారు చేసిన బోర్డు
న్యూఢిల్లీ : రెండున్నరేండ్ల విరామం తర్వాత హైదరాబాద్ ఓ ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్‌కు హైదరాబాద్ వేదికగా ఎంపికైంది. ఈ సిరీస్‌తో పాటు సౌతాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌ల షెడ్యూల్, వేదికలను బీసీసీఐ గురువారం ఖరారు చేసింది. సెప్టెంబర్ 25వ తేదీన ఉప్పల్ స్టేడియంలో ఆసీస్, ఇండియా మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. చివరగా 2019 డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. కాగా, ఆసీస్‌తో తొలి రెండు మ్యాచ్‌లకు మొహాలీ (సెప్టెంబర్ 20), నాగ్‌పూర్ (సెప్టెంబర్ 23) ఆతిథ్యం ఇస్తాయి. అనంతరం సౌతాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేల్లో ఇండియా పోటీ పడుతుంది. సెప్టెంబర్ 28, అక్టోబర్ 1, 3వ తేదీల్లో జరిగే మూడు టీ20లను త్రివేండ్రం, గువాహతి, ఇండోర్‌లో షెడ్యూల్ చేశారు. అక్టోబర్ 6, 9, 11వ తేదీల్లో వరుసగా రాంచీ, లక్నో, ఢిల్లీలో మూడు వన్డేలు జరుగుతాయి.
