అమెరికా రోడ్లపై తెలంగాణ మహిళ.. ఆకలితో అలమటిస్తూ నరకం

అమెరికా రోడ్లపై తెలంగాణ మహిళ.. ఆకలితో అలమటిస్తూ నరకం

విదేశాల్లో మాస్టర్స్​ చేయాలన్న కలతో ఆ మహిళ అమెరికా వెళ్లింది. అనుకోని ఆపదతో సర్వస్వం కోల్పోయి అక్కడి రోడ్లపై నరకయాతన అనుభవిస్తోంది. ఆ మహిళ మరెవరో కాదు. మన హైదరాబాద్​కి చెందిన వారే. ఈ విషయం బీఆర్​ఎస్​ లీడర్ ద్వారా వెలుగులోకి వచ్చింది. 

ఆమెను ఇండియాకు తిరిగి రప్పించేందుకు సాయం చేయాలని కేంద్రాన్ని ఆయన కోరారు. ఇందుకు సంబంధించిన వివరాలు...

మౌలాలి నుంచి మాస్టర్స్​ కోసం..

హైదరాబాద్​ మౌలాలికి చెందిన సయ్యదా లులు మిన్హాజ్​జైదీ మాస్టర్స్​ చేసేందుకు 2021 ఆగస్టులో యూఎస్​వెళ్లారు. తరచూ ఆమె తల్లి సయ్యదా వహాజ్​ ఫాతిమాతో ఫోన్లో మాట్లాడేది. కానీ రెండు నెలలుగా కుమార్తె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 

ఈ క్రమంలో అమెరికా వెళ్లిన తెలంగాణ వాళ్లు కొందరు బాధితురాలిని గుర్తించి తల్లికి సమాచారం అందించారు.  ఆమె వస్తువులు అమెరికాలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని.. దీంతో చికాగో రోడ్లపై ఆకలితో అల్లాడిపోతున్నట్లు తల్లికి చెప్పారు. 

చాలా రోజులుగా ఇదే పరిస్థితి ఉండటంతో యువతి మెంటల్​ ప్రెషర్ కి లోనవుతున్నట్లు గుర్తించారు. తల్లడిల్లిన తల్లి తన కుమార్తెను ఇండియాకు తీసుకురావాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్​కి లేఖ రాశారు.  

కుమార్తె వివరాలు.. ఆమె సమాచారాన్ని తనకు అందించిన వారి వివరాలను లేఖలో ప్రస్తావించారు. ఈ లేఖను బీఆర్​ఎస్​ నేత ఖలీకర్​ రెహమాన్​ తన ట్విటర్లో పోస్ట్​ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.