మహిళలకు గుడ్ న్యూస్.. జనవరి 6న నుమాయిష్ లేడీస్ స్పెషల్

మహిళలకు గుడ్ న్యూస్.. జనవరి 6న నుమాయిష్ లేడీస్ స్పెషల్

హైదరాబాద్ లో ఉండే మహిళలకు గుడ్ న్యూస్. నాంపల్లిలో జరిగే నుమాయిష్ లో  జనవరి 6న కేవలం మహిళలను మాత్రమే అనుమతించనున్నారు.  ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ( AIIE) ప్రతి ఏటా మహిళల కోసం లేడిస్ డే స్పెషల్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా జనవరి 6న మంగళవారం (Ladies Day celebrations 2026) లేడిస్ స్పెషల్ డేను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.  ఆ రోజు పదేళ్ల కంటే ఎక్కువ వయసున్న అబ్బాయిలను ఎగ్జిబిషన్ లోకి అనుమతించరు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 4:30 గంటల నుంచి వేడుకలు జరుగుతాయి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ జోన్) డాక్టర్ కె శిల్పవల్లి ముఖ్య అతిథిగా హాజరవుతారు.

మహిళల కోసం ప్రత్యేక రోజును కేటాయించాలని 1940లో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారని చెబుతారు.హైదరాబాద్  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 85వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ‘నుమాయిష్‌ ను  జనవరి 1న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు.

జనవరి1 నుంచి ఫిబ్రవరి 15 వరకు   ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ జరగనుంది. దేశ నలుమూలల నుంచి రకరకాల సంప్రదాయాలకు చెందిన కళాకృతులు ఇక్కడ కొలువు దీరుతున్నాయి.  ఈ సారి నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌లో 1050 స్టాళ్లు ఉన్నాయి.  దేశ వ్యాప్తంగా ఉన్నచిన్న, మధ్య తరహా, మైక్రో ఇండస్ట్రీలకు సంబంధించిన ఉత్పత్తుల స్టాల్స్ ఇందులో ఏర్పాటు చేశారు.   దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన హస్తకళలు, దుస్తులు, గృహోపకరణాలు, ఆభరణాలు, డ్రై ఫ్రూట్స్ వంటి వస్తువులు అందుబాటులో ఉంటాయి.

నుమాయిష్ ఎగ్జిబిషన్ సందర్శనకు వచ్చే వారి కోసం టీజీఎస్ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. పారిశ్రామిక ప్రదర్శనగానే కాకుండా దేశం నలుమూలల నుంచి రకరకాల సంప్రదాయాలకు చెందిన కళాకృతుల స్టాల్స్ తో ఆయా రాష్ట్రాల సంస్కృతుల సమ్మేళన వేదికగా నిలుస్తుంది.

ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 వరకు, వీకెండ్‌‌‌‌‌‌‌‌, హాలిడేస్‌‌‌‌‌‌‌‌లో రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ తెరిచి ఉంటుంది. ఎంట్రీ ఫీజు రూ.50 కాగా, ఐదేండ్లలోపు చిన్నారులకు ఉచిత ప్రవేశం కల్పిస్తోంది ప్రభుత్వం. నుమాయిష్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో 19 విద్యా సంస్థలను నిర్వహిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేయనున్నారు.