
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీ శివారుల్లో గతంలో వేసిన పంచాయతీ లే-అవుట్లకు రక్షణ లేకుండా పోయిందని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రోడ్లు, పార్కుల హద్దులను చెరిపేసి వ్యవసాయ భూములుగా మార్చేశారని ఆరోపించారు. ఇదేంటని అడిగితే ధరణి ద్వారా తెచ్చుకున్న పాసు పుస్తకాలు చూపించి దబాయిస్తున్నారన్నారు. సోమవారం హైడ్రా ఆఫీస్‌లో నిర్వహించిన ప్రజావాణికి 64 ఫిర్యాదులు రాగా, ఇందులో 60 శాతానికి పైగా పాత లేఅవుట్లపైనే ఉన్నాయి. వీటిని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గూగుల్ మ్యాప్స్ ద్వారా పరిశీలించి, పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు.
- రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెములలోని సర్వే నంబర్ 739 నుంచి 749 వరకు మొత్తం149 ఎకరాల్లో 1987లో 2080 ప్లాట్లతో ప్రొఫెసర్ జయశంకర్ ఏకశిలా కాలనీ లేఅవుట్వేశారు. ఇందులోని నాలుగు సర్వే నంబర్లలో 47 ఎకరాల భూమి తమదంటూ ఆలూరి వెంకటేశ్ తో పాటు మరికొందరు ధరణి ద్వారా పాస్‌పుస్తకాలు సంపాదించి కబ్జా చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు.
- అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్ద అంబర్ పేటలో 264, 265, 266 సర్వే నంబర్లలో 500 ప్లాట్లతో ఉన్న శ్రీ బాలాజీ నగర్ లేఅవుట్ఆ తర్వాత శ్రీ సాయినగర్ కాలనీ లే అవుట్‌గా మారిపోయిందని పాత లేఅవుట్ ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రిట్ పిటిషన్ 33331/2018 ద్వారా కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. ఇందులోని 40 అడుగుల మెయిన్‌రోడ్డును మూసివేయడంతో ఔటర్ రింగురోడ్డును, విజయవాడ హైవేకు దారి లేకుండా పోయిందని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.
- మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం రెడ్డి ఎన్‌క్లేవ్‌లో 2460 గజాల పార్కు స్థలం ఉండగా, ఇందులో 667 గజాల స్థలాన్ని కబ్జా చేశారని ఆ కాలనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
- మెహిదీపట్నం -మల్లేపల్లి మార్గంలోని ఆసిఫ్‌నగర్‌లో దర్గా భూమిని కూడా కబ్జాదారులు వదలడం లేదని, 3800 గజాల స్థలం తనదని ఓ వ్యక్తి కబ్జా చేశారంటూ దర్గా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.