- మురుగునీరు నేరుగా చెరువులోకి కలవడంపై కమిషనర్ ఆగ్రహం
- ఖాజాగూడ చెరువు కబ్జాల పరిశీలన
మాదాపూర్, వెలుగు: దుర్గం చెరువు దుర్గంధం, ఖాజాగూడ చెరువు కబ్జాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో మంగళవారం పరిశీలించారు. దుర్గం చెరువులో సగభాగం వరకు గుర్రపు డెక్క వ్యాపించడానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఎస్టీపీలు ఉన్నప్పటికీ వరద కాలువ ద్వారా మురుగునీరు నేరుగా చెరువులోకి కలవడం పట్ల కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల మురుగునీరంతా ఎస్టీపీ లైన్లోకి వెళ్లేలా జాగ్రత్త పడాల్సిన సంబంధిత అధికారులు ఆ దిశగా పని చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం హైడ్రా కార్యాలయంలో చెరువు పరిరక్షణ బాధ్యతలు చేపట్టిన అన్ని సంస్థలతో సమావేశమయ్యారు. వరద కాలువలోకి మురుగునీరు వెళ్లకుండా పైపులైను డైవర్షన్ పనులు చేపట్టడానికి జలమండలికి ఉండే ఇబ్బందులను తొలగించారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ డా. ఎం రమేశ్ తో మాట్లాడి ట్రాఫిక్ డైవర్షన్‌కు సహకరించాలని సూచించారు.
ఇదే సమయంలో చెరువు అభివృద్ధి పనులు చేపట్టిన రహేజా సంస్థ ప్రతినిధులతో కూడా మాట్లాడి ఇన్ ఆర్బిట్ మాల్, నెక్టర్ గార్డెన్స్ ఇలా పైభాగంలోని ఐటీ సంస్థల నుంచి వచ్చే మురుగునీరు చెరువులోకి కలవకుండా చెరువుకు ఆనుకుని పడమర వైపు కాలువను తవ్వేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
త్వరలో ఖాజాగూడ ఆక్రమణల చిట్టా
ఖాజాగూడ చెరువు అలుగుతో పాటు తూములు మూసేయడంతో పాటు డైవర్ట్ చేసినట్టు గుర్తించారు. ఖాజాగూడ చెరువు కింద భాగంలో దీనికి అనుసంధానంగా ఉన్న చిన్న చెరువు రూపురేఖలు మార్చినట్టు గుర్తించారు. చెరువు ఆనవాళ్లు లేకుండా చేయడాన్ని గమనించారు. అలాగే చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో కొంతమంది ఆక్రమించుకుని షెడ్డులు నిర్మించినట్టు గుర్తించారు. ఈ భూమి తమదే అంటున్నవారి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించాలని హైడ్రా నిర్ణయించింది. దీంతో త్వరలో ఖాజాగూడ చెరువు ఆక్రమణ చిట్టా బయటకు రానుంది.
