
- మొత్తం 950 చెరువులు
- ఇరిగేషన్, రెవెన్యూ సహకారంతో హద్దులు నిర్ణయిస్తున్న హైడ్రా
- హైడ్రా వెబ్ సైట్ లో అన్ని వివరాలు లభ్యం
- మూడు నెలల్లో ప్రక్రియ పూర్తయ్యేలా ప్లాన్
హైదరాబాద్ సిటీ, వెలుగు :చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను తేల్చే పనిలో హైడ్రా బిజీగా మారింది. మొత్తం హైడ్రా పరిధిలో 950 చెరువులున్నాయి. హైడ్రా ఏర్పడక ముందు హెచ్ఎండీఏ 150 చెరువులకు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చింది.
500 చెరువులకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే, ఫైనల్నోటిఫికేషన్కు సంబంధించి కొన్ని అభ్యంతరాలను స్వీకరించినా ఇంకా పని పూర్తి చేయలేదు. అప్పుడు హెచ్ఎండీఏ కమిషనర్లేక్ప్రొటెక్షన్కమిటీ చైర్మన్‌గా ఉండగా, హైడ్రా ఏర్పాటు తర్వాత హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.
దీంతో ఇప్పటికే ఫైనల్, ప్రిలిమినరీ నోటిఫికేషన్ పూర్తయిన చెరువుల హద్దులు పరిశీలించడంతో పాటు మిగిలిన అన్ని చెరువులకు ఫైనల్ నోటిపికేషన్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. నెలాఖరులో కొన్ని చెరువుల హద్దులు ఫైనలైజ్చేసి..అభ్యంతరాలను స్వీకరించి అందరికీ ఆమోదయోగ్యమైన హద్దులు డిసైడ్చేసేందుకు రెడీ అవుతున్నారు.
వెబ్సైట్లలో వెతుకుతున్న జనాలు
ఇప్పటికే నగరంలో ఎన్ని చెరువులున్నాయి? అవి ఎక్కడెక్కడున్నాయి? ఏ చెరువు పరిధి ఎక్కడి వరకు ఉంది? ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఏ మేరకు విస్తరించి ఉంది? అనే వివరాల కోసం ఇండ్లు, జాగలు కొనాలనుకుంటున్న జనం ఆఫీసులతో పాటు వెబ్ సైట్లలో వెతుకుతున్నారు. కొత్తగా ఇండ్లు కట్టుకోవాలన్నా, ఓపెన్ ప్లాట్ కొనాలన్నా అది ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి క్లారిటీ ఇచ్చేందుకు ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు హైడ్రా సిద్ధమైంది.
అన్ని వివరాలతో ఫైనల్‌నోటిఫికేషన్
సిటీలోని చెరువుల హద్దులు ఫైనల్ చేసిన తర్వాత అన్ని చెరువుల వివరాలతో కూడిన ఫైనల్ నోటిఫికేషన్ హైడ్రా రిలీజ్ చేయనున్నది.హైడ్రా పరిధిలో ఏయే చెరువు ఎన్ని ఎకరాల మేర ఉన్నాయి? దాని ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఎక్కడి వరకు ఉంది? అది ఎంత మేరకు కబ్జాకు గురైంది? అనే సమాచారం నోటిఫికేషన్ లో ఉండనున్నది. దీని ద్వారా కొత్తగా ఇండ్లు కట్టుకోవాలన్నా, ఫ్లాట్లు కొనాలన్నా అవి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవచ్చు.
రియల్టర్లు ఎప్టీఎల్, బఫర్ జోన్లలో ఇండ్లు కట్టి విక్రయించాలని చూసినా ఈ నోటిఫికేషన్ లోని వివరాల ద్వారా తెలుసుకునేలా హైడ్రా చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ సరిహద్దులు నిర్ణయించే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. హైడ్రా, ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమన్వయంతో చెరువుల హద్దులు నిర్ణయిస్తున్నారు.
మూడునెలల్లో ప్రక్రియ పూర్తి
హైడ్రా రిలీజ్ చేయనున్న చెరువుల ఫైనల్ నోటిఫికేషన్ లో డిజిటల్ మ్యాప్స్ ఉండనున్నాయి. చెరువు ఉన్న ప్రాంతాన్ని, అలుగు, తూములను హైడ్రా సిబ్బంది మ్యాపింగ్ చేస్తున్నారు. మేడ్చల్, దుండిగల్, దేవరయాంజల్, కొంపల్లి, శామీర్‌పేట్, గాజులరామారం, కుత్బుల్లాపూర్, పేట్‌బషీరాబాద్, కూకట్ పల్లి, శేరిలింగం పల్లి ప్రాంతాల్లోని చెరువుల హద్దులను గుర్తిస్తున్నారు. ఇప్పటికే 35 నుంచి 40 చెరువులకు హద్దులను నిర్ణయించామని వాటికి సంబంధించిన నోటిఫికేషన్లను ఈ నెలాఖరులో విడుదల చేస్తామంటున్నారు. ఈ ప్రక్రియ మొత్తం మూడునెలల్లో పూర్తి చేయనున్నారు.
హద్దుల నిర్ణయం ఇలా..
1975 నాటి సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్, 1950 నాటి విలేజ్ మ్యాపులు, రెవెన్యూ మ్యాప్స్, ఎన్ఆర్ఎస్ఏ శాటిలైట్ ఇమేజెస్ ను పరిగణనలోకి తీసుకుని హైడ్రా హద్దులు నిర్ణయిస్తోంది. అయితే, అప్పటి వివరాలతో చెరువులు, కుంటల హద్దులు నిర్ణయిస్తే ఇప్పటికే ఇండ్లు కట్టుకుని ఉంటున్న వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కానీ, తాము ఇండ్లు కట్టుకుని ఉంటున్న సాధారణ జనాల జోలికి పోయేది లేదని హైడ్రా స్పష్టం చేసిన నేపథ్యంలో వారికి అన్యాయం జరగకుండా హద్దులు నిర్ణయించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అప్పటి మ్యాపులను ప్రామాణికంగా తీసుకున్నా..ఇప్పుడు నివాసం ఉంటున్న జనాల ఇండ్ల వరకు హద్దులు మార్చే ఛాన్స్ఉందంటున్నారు.