హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు హాజరయ్యారు. పలు కంటెంప్ట్ పిటిషన్లలో వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన క్రమంలో శుక్రవారం ( డిసెంబర్ 5 ) కోర్టుకు హాజరయ్యారు రంగనాథ్. నవంబర్ 27 జరిగిన విచారణలోనే హాజరు కావాలని కోర్టు ఆదేశించినప్పటికీ.. ఆబ్సెంట్ పిటిషన్ వేశారు రంగనాథ్. ఈ క్రమంలో ఆబ్సెంట్ పిటిషన్ పై అభ్యంతరం వ్యక్తం చేసింది కోర్టు. ఈసారి హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామంటూ హెచ్చరించింది హైకోర్టు.
ఈ క్రమంలో ఇవాళ కోర్టుకు హాజరయ్యారు కమిషనర్ రంగనాథ్. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ స్థలాలు, చెరువులను కాపాడే క్రమంలో ఇటీవల దూకుడు పెంచింది. పాతబస్తిలోని చారిత్రాత్మక చెరువుకు పూర్వవైభవం తెచ్చే పనిలో పడింది హైడ్రా. ఆక్రమణలతో కుచించుకుపోయిన ఈ చెరువును భావితరాలకు అందించేలా తీర్చిదిద్దుతున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. మంగళవారం ఆయన చెరువును పరిశీలించి మాట్లాడుతూ 15 రోజుల్లో చెరువు ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు.
గత ఏడాది ఆగస్టు నుంచి ఆక్రమణలు తొలగిస్తూ చుట్టూ బండ్, ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు, మూడు వైపులా ఎంట్రీలు ఏర్పాటు చేశారు. నిజాం కాలంలో ఔషధ గుణాలున్న నీటికి ప్రసిద్ధి చెందిన ఈ చెరువు చరిత్రను పునరావృతం చేసేలా ఔషధ మొక్కలు, నీడనిచ్చే చెట్లు నాటాలని రంగనాథ్ఆదేశించారు. వాకింగ్ ట్రాక్, లైటింగ్, పిల్లల ప్లే ఏరియా, వృద్ధుల సీటింగ్ జోన్లు, ఓపెన్ జిమ్, పార్కు నిర్మాణం పూర్తి చేయాలన్నారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి హైడ్రా హెడ్డాఫీసు నుంచి పర్యవేక్షించాలన్నారు.
