
- జూబ్లీహిల్స్ రోడ్‌నంబర్ 41లోని పార్కు రోడ్డు, నాలా స్థలం ఆక్రమణ
- పక్కనే కిరాయికి ఉంటూ దందా
- హాస్టల్ కు, కార్ల షెడ్డుకు అద్దెకు ఇచ్చి నెలకు రూ.10 లక్షల సంపాదన
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ రోడ్‌నంబర్-41లోని పెద్దమ్మ తల్లి టెంపుల్ సమీపంలో అత్యంత విలువైన పార్కు స్థలాన్ని కబ్జా చేసి నెలకు రూ. 10 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తికి హైడ్రా షాక్ఇచ్చింది. పార్కు రోడ్డును, నాలాను కబ్జా చేసి హాస్టల్ కట్టి అద్దెకు ఇవ్వడంతో పాటు కార్ల షెడ్లకు రెంట్‌కు ఇస్తూ నెలకు రూ. 10 లక్షలు సంపాదిస్తున్నాడని తెలుసుకుని అధికారులు ఆశ్చర్యపోయారు. కోర్టు ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు.
30 ఫీట్ల రోడ్డు దారిలో ఆక్రమణలు తొలగించి 2 ఎకరాల పార్కుకు దారి క్లియర్ చేశారు. దాదాపు రూ. 200 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడారు. జూబ్లీహిల్స్ సొసైటీ ప్రతినిధులు, అక్కడి స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫీల్డ్లెవెల్లో పరిశీలించారు. నాలాతో పాటు రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు నిర్ధారణ కావడంతో తొలగించాలని నోటీసులు ఇచ్చారు. కోర్టు నుంచి కూడా అనుమతులు లభించడంతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు.
కిరాయికి ఉంటూ కబ్జాలు...
జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్41లో అవసరాల శ్రీనివాస్, రుక్మాందగ రావుకు వెయ్యి గజాల స్థలం ఉంది. ఇందులో 200 గజాల వరకు ఇల్లు కట్టారు. ఈ ఇంటిని క్రోతుపల్లి శ్రీనివాస్ కు అద్దెకు ఇచ్చారు. ఈ ఇంటికి పక్కనే 30 అడుగుల మేర రోడ్డు ఉంది. ఈ రోడ్డు మీదుగా వెళ్తే రెండెకరాల పార్కుకు చేరుకోవచ్చు. 30 అడుగుల మేర ఉన్న రోడ్డుపైనే బాక్సు టైపు నాలా ఉంది.
ఈనాలాతో పాటు రోడ్డుని సగం కిరాయిదారుడు ఆక్రమించాడు. ఇంటి ఖాళీ స్థలంతో పాటు పక్కనే ఉన్న రోడ్డును కూడా ఆక్రమించి హాస్టల్ కట్టాడు. ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో కారు రిపేర్ల షెడ్డును ఏర్పాటు చేసి అద్దెలకు ఇచ్చాడు. మొత్తం 907 గజాలను ఆక్రమించాడు. వీటి నుంచి సుమారు రూ. 10 లక్షలను ప్రతి నెలా రెంట్రూపంలో పొందుతున్నాడు. ఈ విషయాలన్నీ ఇంటి ఓనర్‌కు తెలియకపోవడం గమనార్హం.
హైకోర్టుకు వెళ్లిన కిరాయిదారు అయినా...
హైడ్రా నోటీసులను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కిరాయిదారు శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించాడు. రోడ్డును, నాలాను ఆక్రమించి ఎలా నిర్మాణాలు చేపడతావంటూ శ్రీనివాస్ ను కోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలున్నాయా అని అతడు అద్దెకు ఉంటున్న ఇంటి ఓనర్‌ను అడిగింది.
తనకెలాంటి అభ్యంతరాలు లేవని చెప్పడంతో ఆక్రమణల తొలగించేందుకు హైకోర్టు అనుమతులిచ్చింది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అక్కడ నిర్మించిన హాస్టల్ బిల్డింగ్‌ను, కారు మెకానిక్ షెడ్డును తొలగించింది. పార్కుకి వెళ్లే రోడ్డు క్లియర్ కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు.