ధరణి ద్వారా అక్రమ పాస్బుక్లు సృష్టించి వెంచర్.. హైద్రాబాద్ బడంగ్పేట్లో హైడ్రా కూల్చివేతలు

ధరణి ద్వారా అక్రమ పాస్బుక్లు సృష్టించి వెంచర్.. హైద్రాబాద్ బడంగ్పేట్లో హైడ్రా కూల్చివేతలు

గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ధరణి పోర్టల్ ఆధారంగా అక్రమ పాస్ బుక్ లు సృష్టించి కొత్త వెంచర్ వేసి కోట్లలో వ్యాపారానికి తెరతీశారు కొందరు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగాయి ఈ కబ్జాలు. బాధితుల ఫిర్యాదు మేరకు వెంచర్ ను స్వాధీనం చేసుకుని ప్లాట్లను బాధితులకు అప్పగించింది హైడ్రా.

వివరాల్లోకి వెళ్తే.. బడంగ్ పేట నాదర్గుల్లో హైడ్రా అధికారులు బుధవారం (అక్టోబర్ 08) అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. 1986లో టెలికాం కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఒక వెంచర్‌ గా దాదాపు 100 ఎకరాల భూమిలో ప్లాట్లను ఏర్పాటు చేసి, సొసైటీ సభ్యులకు పంపిణీ చేసింది.

2016లో ధరణి ద్వారా అక్రమ పాస్‌బుక్‌లు సృష్టించి, సొసైటీకి చెందిన భూమిలో మరో కొత్త వెంచర్‌ను ఏర్పాటు చేశారు అక్రమార్కులు. ఈ క్రమంలో దాదాపు 23 ఇంటి నిర్మాణ అనుమతులు అక్రమంగా పొందారు. ఈ అక్రమాలను గమనించిన అసలైన ప్లాట్ యజమానులు కలెక్టర్, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో హైడ్రాను ఆశ్రయించారు. 

హైడ్రా అధికారులు దీనిపై సమగ్ర విచారణ జరిపి, అక్రమంగా మంజూరైన పర్మిషన్లను రద్దు చేశారు. ప్లాట్లను స్వాధీనం చేసుకుని అసలైన యజమానులకు తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయం జరగడంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు.