ఈ ఏడాది చివరికల్లా హైడ్రోజన్​ ట్రైన్ రెడీ: అశ్విని వైష్ణవ్

ఈ ఏడాది చివరికల్లా హైడ్రోజన్​ ట్రైన్ రెడీ: అశ్విని వైష్ణవ్
  • కల్కా ‑ షిమ్లా రూట్​లో తొలి రైలు

హైదరాబాద్, వెలుగు:  పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి హైడ్రోజన్​ ట్రైన్​ ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ‘వందే మెట్రో’ పేరుతో తొలి హైడ్రోజన్​ ట్రైన్​ను హర్యానాలోని కల్కా – హిమాచల్​ ప్రదేశ్​లోని షిమ్లా రూట్​లో నడిపిస్తామని వెల్లడించారు. రైల్వేలో గ్రీన్​ టెక్నాలజీని వినియోగంలోకి తెచ్చే దిశగా హైడ్రోజన్​ ట్రైన్​ ద్వారా తొలి అడుగు పడబోతోందని చెప్పారు. తొలి దశలో న్యారోగేజ్​ రైల్వే లైన్లపై మాత్రమే హైడ్రోజన్​ ట్రైన్స్​ నడుపుతామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 1,275 రైల్వే స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా ఎంపిక చేసి, అత్యాధునిక వసతులతో   తిరిగి నిర్మిస్తున్నామని  తెలిపారు.  బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.  వందేభారత్ ట్రైన్ ను దేశ ప్రజలు వరల్డ్ క్లాస్ ట్రైన్ గా భావించి, సంతోషంగా జర్నీ చేస్తున్నారని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ప్రస్తుతం చెన్నై లో వందేభారత్ ట్రైన్ కోచ్ లు తయారవుతున్నాయని, త్వరలో రాయ్ బరేలీలో కూడా తయారీ ప్రాసెస్​ను స్టార్ట్ చేస్తామన్నారు. వచ్చే ఏడాది మార్చికల్లా ప్రతి వారం రెండు, మూడు వందే భారత్ ట్రైన్లను ప్రారంభిస్తామన్నారు. ముంబై నుంచి అహ్మదాబాద్​ కు బుల్లెట్ ట్రైన్ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.  త్వరలో కాశీ, షిరిడీ  వంటి రైల్వే టూరిజం సర్క్యూట్ లను అందుబాటులోకి తెస్తామన్నారు. మెట్రో సిటీల్లో 60 కిలోమీటర్ల జర్నీలకు  వచ్చే ఏడాది వందేభారత్ మెట్రో రైళ్లను తీసుకొస్తామని ప్రకటించారు. పదేళ్ల క్రితం రోజుకు 4 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మాణం జరిగితే.. ఇప్పుడు రోజుకు 12 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం జరుగుతోందని, త్వరలో దీనిని 16 కు పెంచుతామన్నారు. 

తెలంగాణకు 12 వేల కోట్లు కేటాయించే చాన్స్​ 

రైల్వే జోన్లు, డివిజన్ల వారీగా కేటాయింపుల వివరాలతో కూడిన పింక్ బుక్​ను గురు లేదా శుక్రవారం పార్లమెంట్ లో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత శుక్రవారం లేదా శనివారం పింక్ బుక్​ను విడుదల చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్  మీడియాకు తెలిపారు. గతేడాది తెలంగాణకు రూ.9 వేల కోట్లు కేటాయించారని, ఈ ఏడాది దాదాపు రూ.12 వేల కోట్లు కేటాయించే చాన్స్​ ఉందని పేర్కొన్నారు. రైల్వే సమస్యలు, రైళ్ల పొడిగింపు పై తనను కలిసి ఎంపీలు ఇస్తున్న వినతిపత్రాలను రైల్వే బోర్డుకు వెంటనే పంపుతున్నామని తెలిపారు.