డెడ్బాడీతో ఆందోళన..జూబ్లీహిల్స్ పీఎస్ ముందు ఉద్రిక్తత

డెడ్బాడీతో ఆందోళన..జూబ్లీహిల్స్ పీఎస్ ముందు ఉద్రిక్తత

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హిట్ అండ్ రన్ కేసులో మృతి చెందిన తారక్ డెడ్ బాడీతో  కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.  స్పీడ్ గా వెళితే చలాన్లు వేసే అధికారులు ప్రాణం తీసిన వ్యక్తిని ఇంకా పట్టుకోకపోవడం ఏంటంటూ నిలదీశారు. 

సీసీ ఫుటేజీ ఆధారంగా వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఈ విషయం తెలిసినా బయటకు చెప్పడం లేదని ఆరోపించారు.  మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.  దీంతో  జూబ్లీహిల్స్ పిఎస్  దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఇవాళ తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో  రోడ్డు ప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దమ్మ గుడి మలుపు దగ్గర  అతి వేగంతో దూసుకొచ్చిన ఓ కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.  దీంతో  కారు నడుపుతున్న వ్యక్తి... బైక్‌ను ఢీకొట్టి ఆపకుండా పరారయ్యాడు. సంఘటనా స్థలంలో ఉన్న  సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు.. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ ఢీకొట్టిన కారు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.