కారు కొనాలనుకుంటున్నారా? జూన్ 1 నుంచి పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు

కారు కొనాలనుకుంటున్నారా? జూన్ 1 నుంచి పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు

కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే ఆటో దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా షాకింగ్ న్యూస్ చెప్పింది. తమ కార్ల ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ పెంచిన ధరలు జూన్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. నిజానికి ఈ ధరల పెంపు మే నెలలోనే జరగాల్సి ఉన్నప్పటికీ, వినియోగదారులకు ఊరటనిస్తూ కంపెనీ ఒక నెల పాటు దీనిని వాయిదా వేసింది. ఇప్పుడు ఆ గడువు ముగియడంతో జూన్ నుంచి కొత్త ధరలు అమలు కానున్నాయి.

కార్ల తయారీకి అవసరమైన స్టీల్, అల్యూమినియం వంటి లోహాల ధరలు విపరీతంగా పెరగడం, కమొడిటీ ఖర్చులతో పాటు ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్ ఎక్కువ కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని హ్యుందాయ్ స్పష్టం చేసింది. ఇప్పటివరకు పెరిగిన వ్యయాల భారాన్ని కంపెనీయే భరిస్తూ వచ్చినప్పటికీ.. ఉత్పత్తి ఖర్చులు నిరంతరం పెరుగుతుండటంతో ధరల సవరణ అనివార్యమైందని పేర్కొంది. ప్రస్తుత 2026 క్యాలెండర్ ఇయర్‌లో హ్యుందాయ్‌ రెండోసారి రేట్లను పెంచటం గమనార్హం. అంతకుముందు జనవరిలో కార్ల ధరలను సగటున 0.6 శాతం పెంచింది.

ఈ తాజా నిర్ణయంతో హ్యుందాయ్ కార్లపై గరిష్టంగా రూ.12వేల 800 వరకు రేటు పెరగనుంది. అయితే ఈ పెంపు అనేది కారు మోడల్, దాని వేరియంట్‌ను బట్టి మారుతుంది. ఉదాహరణకు ఎంట్రీ లెవెల్ మోడల్ అయిన గ్రాండ్ i10 నియోస్ కొనేవారిపై పడే భారం కంటే, టాప్-ఎండ్ మోడల్ అయిన టక్సన్ కొనేవారిపై పడే భారం చాలా ఎక్కువగా ఉంటుందట. కేవలం ఎక్స్-షోరూమ్ ధరలే కాకుండా.. ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, రోడ్ టాక్స్ వంటివి కూడా తోడవుతాయి కాబట్టి వినియోగదారులపై పడే ఆన్-రోడ్ ధరల ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండొచ్చని ఆటో నిపుణులు అంటున్నారు.

ALSO READ : ఎల్ఐసీ పాలసీకి క్రెడిట్ కార్డుతో పేమెంట్స్ అవ్వట్లేదా..?

ఈ పెంపు గ్రాండ్ i10 నియోస్, ఆరా, ఎక్స్టర్, i20, వెన్యూ, క్రెటా, వెర్నా, అల్కజార్, టక్సన్, ఐయోనిక్ 5 వంటి అన్ని మోడళ్లపై పడనుంది. క్రెటా, వెన్యూ, ఎక్స్టర్ వంటి అత్యధికంగా అమ్ముడయ్యే మోడళ్లపై ఈ చిన్న ధరల మార్పు కూడా మధ్యతరగతి కొనుగోలుదారుల నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ధరలకు ప్రాధాన్యతనిచ్చే విభాగాల్లో డిమాండ్‌ను కాపాడుకుంటూనే, తన పాపులర్ ఎస్‌యూవీల మార్జిన్లను నిలబెట్టుకోవడం హ్యుందాయ్‌కి ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. ఒక్క హ్యుందాయ్ మాత్రమే కాదు.. మారుతి సుజుకి కూడా జూన్ నుంచి రూ.30వేల వరకు, మహీంద్రా ఏప్రిల్ నుంచే ధరలను పెంచేశాయి. దీంతో రానున్న రోజుల్లో కార్లను కొనేవారు ఎక్కువ ఖర్చు చేయక తప్పదని తెలుస్తోంది.