ఎల్ఐసీ పాలసీ ప్రీమియంలను క్రెడిట్ కార్డ్ ద్వారా కట్టాలనుకుంటున్నారా. అయితే మీకో ఇంపార్టెంట్ అప్‌డేట్. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లుగా ఎల్ఐసీ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఆప్షన్‌ను పూర్తిగా ఏమీ తీసేయలేదు. అయితే కొన్ని రకాల లావాదేవీలపై గట్టిగానే ఆంక్షలు విధించింది. దీనివల్ల చాలా మంది కస్టమర్లు కంగారుపడుతున్నారు. అసలు ఎల్ఐసీ అధికారికంగా క్రెడిట్ కార్డ్ వాడకంపై ఎలాంటి రూల్స్ పెట్టిందో క్లారిటీగా చూద్దాం..
ఏఏ పేమెంట్స్ అలౌవ్డ్..
మీరు మీ పాలసీకి సంబంధించిన రెగ్యులర్ ప్రీమియంలను క్రెడిట్ కార్డ్ ద్వారా హ్యాపీగా చెల్లించవచ్చు. ఇందుకోసం ఎల్ఐసీ అఫీషియల్ ఆన్‌లైన్ పోర్టల్, 'MyLIC' యాప్, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగించవచ్చు.
ఎలాంటి పేమెంట్స్ అంగీకరించరు..
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పాలసీపై మీరు లోన్ తీసుకుని ఉంటే.. ఆ లోన్ తిరిగి చెల్లించడానికి లేదా దానికి సంబంధించిన వడ్డీ కట్టడానికి క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయటం కుదరదు. ఎందుకంటే.. ఎల్ఐసీ ఈ లోన్ అకౌంట్లకు క్రెడిట్ కార్డ్ ఆప్షన్‌ను పూర్తిగా డిసేబుల్ చేసింది. వీటికి కేవలం నెట్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే వాడాలి.
మీ కార్డు ఎందుకు రిజెక్ట్ అవుతుందంటే?
ఒకవేళ మీరు ప్రీమియం కడుతున్నా కార్డ్ ఆప్షన్ కనిపించకపోవడానికి, పేమెంట్ ఫెయిల్ అవ్వడానికి ఈ క్రింది కారణాలు ఉండవచ్చు:
1. NACH అటో-పే: మీ పాలసీ ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ ద్వారా ఆటోమేటిక్‌గా కట్ అయ్యే NACH' మోడ్‌లో రిజిస్టర్ అయి ఉండి ఏ కారణం వల్లనైనా పేమెంట్ ఫెయిల్ అయితే తప్ప, వేరే ఏ ఛానల్ ద్వారా లేదా క్రెడిట్ కార్డుతో ప్రీమియం కట్టడం కుదరదు.
2. శాలరీ సేవింగ్స్ స్కీమ్ : మీ జీతం నుంచి నేరుగా కట్ అయ్యే ఎస్ఎస్ఎస్ పాలసీలకు క్రెడిట్ కార్డ్స్ పని చేయవు.
3. లిమిట్ సమస్యలు: మీ ప్రీమియం మొత్తం చాలా ఎక్కువగా ఉంటే, గేట్‌వే పరిమితులు, కార్డ్ లిమిట్ వల్ల పేమెంట్ రిజెక్ట్ కావొచ్చు.
4. థర్డ్-పార్టీ యాప్స్: అమెజాన్ పే, టాటా న్యూ లాంటి యాప్స్ వాడుతుంటే.. వారి రూల్స్ ప్రకారం ఇన్సూరెన్స్ ప్రీమియంలకు క్రెడిట్ కార్డ్ లేదా వాలెట్ బ్యాలెన్స్‌లను కొన్నిసార్లు అనుమతించకపోవచ్చు.
ఎల్ఐసీ క్రెడిట్ కార్డులను అంగీకరించినప్పటికీ.. మీ బ్యాంక్ లేదా కార్డ్ జారీ చేసిన సంస్థ దీనిని ఇన్సూరెన్స్ కేటగిరీ కింద పరిగణిస్తుంది. దీనివల్ల కొన్ని బ్యాంకులు అదనంగా కన్వీనియన్స్ ఫీజులు వసూలు చేయడమే కాకుండా.. రివార్డ్ పాయింట్లు ఇవ్వవు. కాబట్టి కార్డుతో పేమెంట్ చేసేటప్పుడు మీ బ్యాంక్ రూల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
