
జయం, నువ్వు నేను లాంటి ప్రేమకథా చిత్రాలతో పాటు ‘నేనే రాజు నేనే మంత్రి’ లాంటి పొలిటికల్ థ్రిల్లర్స్‌తోనూ మెప్పించారు తేజ. ఎంతోమంది కొత్త వాళ్లని నటీనటులుగా పరిచయం చేసిన ఆయన.. ‘అహింస’ సినిమాతో రామా నాయుడు మనవడు అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. జూన్ 2న సినిమా విడుదలవుతున్న సందర్భంగా తేజ ఇలా ముచ్చటించారు.
‘రామానాయుడు గారికి ఇచ్చిన మాట కోసం అభిరామ్‌ను హీరోగా పరిచయం చేశా. హీరో ఎవరైనా కథకు ఏం అవసరమో అదే తీశా. నటనకు అభిరాం కొత్త కనుక బెరుకు, భయాలు సహజం. కానీ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి ప్రతీది భూతద్దం పెట్టి చూస్తారు. పైగా ఆల్రెడీ స్టార్స్ అయిన వెంకటేష్, రానాలతో పోల్చి చూస్తారు కనుక వాళ్లందరినీ దాటి ముందుకు రావడం చాలా కష్టం. సెలబ్రిటీ ఫ్యామిలీ కనుక అటెన్షన్ ఉంటుంది అనుకుంటారు కానీ అదీ నిజం కాదు. జనం చాలా తెలివైన వాళ్లు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాకి వెళ్ళాలా, వద్దా అని డిసైడ్ అవుతారు. సినిమాలో ఎమోషన్ ఉంటే అది ట్రైలర్‌లోకి వస్తుంది. అది ప్రేక్షకులకు కనెక్ట్ అయితే స్టార్ సినిమానా, కొత్తవాళ్లదా అనే తేడా లేకుండా చూస్తారు. ఎమోషన్ కనెక్ట్ అయితే ఎవరి సినిమా అయినా ఆపలేం.
‘అహింస’ అనే ఫిలాసఫీని బేస్ చేసి రాసిన కథ ఇది. ఎందుకంటే ఆ ఫిలాసఫీపై సరైన క్లారిటీ లేదు. ‘అహింస’ అంటే ఏమిటో అర్థం కాకపోవడం వల్లే దేశంలో హింసాత్మక సంఘటనలు జరిగాయి. మనకి అదేంటో అర్థం కావడం లేదు. అసలు అది కరెక్టా కాదా.. దాన్ని ఎలా ఫాలో అవ్వాలి అనే కాన్సెప్ట్‌ని తీసుకుని కమర్షియల్ కథగా మలిచాం. ఇందులో దాదాపు పద్నాలుగు యాక్షన్ సీక్వెన్స్‌లు వున్నాయి. అందులో నాలుగింటికి నేనే కంపోజ్ చేశాను. అవన్నీ కథలో భాగంగా హీరోకు ఎదురయ్యే కష్టాల నుంచి బయటపడే ప్రయాణంలో వచ్చే ఫైట్సే తప్ప.. హీరో అన్నాక వంద మందిని కొట్టాలనే లెక్కలు వేసుకుని పెట్టలేదు. అది మనకి చేతకాదు కూడా. తమకంటూ ఓ కొత్త స్టైల్‌తో, కొత్త తరహా సినిమాలతో, ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళే దర్శకులని నా బ్యానర్ ద్వారా పరిచయం చేయాలని కోరిక.
దీని వలన సినిమా ఇంకా బెటర్ అవుతుంది. రానాతో చేసే సినిమాకు ‘రాక్షస రాజు’ అనే టైటిల్ అనుకుంటున్నాం. పాలిటిక్స్, క్రైమ్ నేపథ్యంలో ‘గాడ్ ఫాదర్’ తరహాలో సాగే సినిమా. జూన్ 6న రామానాయుడు గారి పుట్టిన రోజు సందర్భంగా స్టార్ట్ చేయబోతున్నాం. డబ్బు, పేరు కోసమైతే పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేయాలి. అవి రెండూ చూసేశాను. పుట్ పాత్ నుంచి వచ్చిన నాకు ఓ కెమెరామేన్ బ్రేక్ ఇచ్చారు. నాలా చాలా మంది వున్నారు. కానీ వాళ్లకు ఇండస్ట్రీలోకి ఎలా రావాలో తెలీదు. వాళ్లకి నేను బ్రేక్ ఇస్తాను. ఆ విషయంలో నన్నెవరూ మార్చలేరు (నవ్వుతూ). ఓ పెద్ద స్టార్స్‌తో సినిమా చేసినా అందులో కొత్తవారిని తీసుకుంటా. నేనెప్పుడూ అసెట్స్‌పై కాదు.. మనుషులపై ఇన్వెస్ట్ చేస్తా.